కరోనా మహమ్మారి ఉగ్ర రూపం దాల్చింది. దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రద్దీగా ఉండే నగరాలతో పాటు పల్లెల్లోనూ ఈ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. ఇక కర్ణాటక రాష్ట్రంలో అయితే.. నిత్యం 20 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఆ రాష్ట్రంలోని ఓ గ్రామంలో సగం మంది వైరస్ బారిన పడడం ప్రస్తుత పరిస్థితికి అర్థం పడుతోంది. బెళగావి జిల్లాలోని అబనాళి గ్రామంలో 300 మంది జనాభా ఉన్నారు. ఆ 300 మంది జనాభాలో ఇప్పటి వరకు 144 మందికి కరోనా సోకింది.
ఈ గ్రామం అటు మహారాష్ట్ర, ఇటు గోవాకు సరిహద్దుల్లో ఉంటుంది. దీంతో నిత్యం ఈ గ్రామంలోని ప్రజలు పనుల కోసం పొరుగు రాష్ట్రాలకు వెలుతుంటారు. ఇటీవల మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభించడంతో.. కఠిన ఆంక్షలు విధించడంతో చాలా మంది కూలీలు స్వగ్రామానికి చేరుకున్నారు. ఏప్రిల్ 10న గ్రామానికి చెందిన ముగ్గురికి జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతుండడంతో ఆస్పత్రికి వెళ్లగా.. అక్కడ వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో వారికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. అయితే.. వారు ఐసోలేషన్ లో ఉండకుండా గ్రామంలో తిరిగారు. ఇటీవల ఒక్క రోజే 20 మందికి పైగా జ్వరంతో బాధపడుతూ.. ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. దీంతో.. అధికారులు గ్రామంలో రాపిడ్ కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు 144 మందికి పాజిటివ్ వచ్చింది. ఆర్‌టీ- పీసీఆర్ పరీక్షలు జరుగుతున్నాయని, ఆఫలితాలు వచ్చిన తరువాత గ్రామాన్ని సీజ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.