కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. కరోనా లాక్‌డౌన్ కారణంగా దేశంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆర్థికంగా చితికిపోవడంతో కొంత మంది ఆత్మహత్యలు పాల్పడిన ఘటనలు తెలిసిందే. అయితే.. దేశ రాజధాని ఢిల్లీలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. తన ఉద్యోగం పోవడానికి కారణం దేవుడేనని ఆగ్రహించిన ఓ యువకుడు ఓ ఆలయంపై దాడికి పాల్పడ్డాడు. ఆలయ ప్రహారి గోడతో పాటు దేవుడి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని పశ్చిమపురిలో మాతా వైష్ణోదేవి ఆలయం ఉంది. అయితే.. రోజుమాదిరిగా ఉదయాన్నే ఆలయం తెరిచాడు పూజారి రామ్ పాఠక్. అయితే.. విగ్రహాలు ధ్వంసం అయి ఉండడాన్ని గమనించాడు. వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా.. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 28 ఏళ్ల వివేక్ హస్తముందని గుర్తించారు. వెంటనే అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తన ఉద్యోగం పోవడానికి దేవుడే కారణం అని.. భగవంతుడే తనను బిచ్చగానిగా మార్చాడని అందుకే విగ్రహాలను ధ్వంసం చేసినట్లు ఆ యువకుడు పోలీసులకు తెలిపాడు.