కరోనా భయం : మూడేళ్లుగా ఇంట్లోనే ఉంటున్న తల్లీ, కుమారుడు.. భర్తను కూడా రానివ్వడం లేదు
ఓ మహిళ కరోనా భయంతో గత మూడేళ్లుగా కుమారుడితో కలిసి స్వీయ నిర్భంధంలో ఉంటోంది. భర్తను కూడా ఇంట్లోకి రానివ్వడం లేదు
By తోట వంశీ కుమార్ Published on 23 Feb 2023 6:46 AM GMTకరోనా భయం ఇంకా కొందరిలో పోలేదు. లాక్‌డౌన్ కాలం నుంచి ఇంకా కొందరు ఇళ్లలో ఉండిపోయారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఘటనలు అప్పుడప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఘటననే గురుగ్రామ్‌లో వెలుగు చూసింది. ఓ మహిళ తన పదేళ్ల కుమారుడితో కలిసి గత మూడు సంవత్సరాలుగా ఇంట్లోనే ఉండిపోయింది. ఆమె బయటకు రావడం అటు ఉంచితే.. కనీసం తన భర్తను కూడా ఇంట్లోకి రానివ్వడం లేదు.
సుజన్ మాఝీ, మున్మున్ మాఝీ దంపతులు గురుగ్రామ్‌లోని చక్కర్‌పూర్‌లో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఓ బాబు ఉన్నాడు. 2020లో కరోనా వ్యాప్తి సమయంలో లాక్‌డౌన్ నిబంధనలు సడలించగానే సుజన్ మాఝీ ఉద్యోగానికి వెళ్లాడు. అయితే.. అప్పటి నుంచి మున్మున్ మాఝీ తన కొడుకుతో కలిసి స్వీయ నిర్భంధాన్ని విధించుకుంది.
ఎవరితోనైనా కలిస్తే ఎక్కడ కరోనా వస్తుందోనని భయపడేది. ఉద్యోగానికి వెళ్లిన భర్తను సైతం ఇంట్లోకి రానిచ్చేది కాదు. ఇలా మూడేళ్లుగా తన కొడుకుతో అదే ఇంట్లో ఉండిపోయింది. బయటకు రావాలని ఆమె భర్త ఎన్నిసార్లు వారించినా ప్రయోజనం లేకపోయింది. చేసేది లేక అతడు పక్కనే మరో ఇంటిలో అద్దెకు ఉండేవాడు. తన భార్య, కుమారుడికి కావాల్సిన నిత్యావసర సరకులను తెచ్చి గుమ్మం వద్ద పెట్టేవాడు. అతడు వెళ్లిపోయిన తరువాత ఆమె వాటిని తీసుకునేది. భార్యాభర్తలు ఇద్దరూ వీడియో కాల్‌లో మాట్లాడుకునేవారు.
ఇంకా మున్మున్ మాఝీలో మార్పు రాకపోవడంతో ఆమె భర్త పోలీసులను ఆశ్రయించాడు. స్పందించిన పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు అక్కడకు వెళ్లి తల్లీ కొడుకులను బయటకు రావాలని కోరగా వారు నిరాకరించారు. తలుపులు పగులకొట్టి వారిని బయటకు తీసుకువచ్చారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమె మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
గదిలో చెత్త కుప్పను చూసి జిల్లా అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. "గది చుట్టూ మూడు సంవత్సరాల చెత్త ఉంది" అని చైల్డ్ వెల్ఫేర్ టీమ్ అధికారి ఒకరు తెలిపారు.