టీనేజ్ అమ్మాయిలు మొబైల్ ఫోన్లు ఉపయోగించడాన్ని గుజరాత్‌లోని ఠాకూర్ కమ్యూనిటీ పంచాయతీ నిషేదించింది. బనస్కాంత జిల్లాలోని భాభార్ తాలూకాలోని లున్సెలా గ్రామంలో ఆదివారం సమాజ సంప్రదాయాలలో సంస్కరణలు తీసుకురావాలని సంఘం ఏకగ్రీవంగా తీర్మానాలను ఆమోదించింది. అదే సమయంలో అమ్మాయిలు మొబైల్ ఫోన్లను ఉపయోగించకుండా నిరోధించాలని నిర్ణయించింది.
ఫోన్ల వల్ల ప్రేమ వ్యవహారాలు, కులాంతర వివాహాలు, వంటివి పెరిగిపోవడంతో పాటు ఎన్నో తప్పుడు విషయాలు జరుగుతున్నాయని అందుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే వావ్ జెనీబెన్ ఠాకూర్ సమక్షంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు.
బాలికలు ఉన్నత చదువుల కోసం పట్టణ ప్రాంతాలకు వెళితే వారికి గ్రామ సంఘం సభ్యులు రవాణా సౌకర్యం కల్పించాలని తీర్మానాల్లో పేర్కొన్నారు. అలాగే వివాహా నిశ్చితార్థ వేడుకకు 11 మంది మాత్రమే హాజరు కావాలని, పెళ్లి వేడుకల్లో డీజే సిస్టమ్‌ను వినియోగించడాన్ని నిషేదించింది. ఠాకోర్ సంఘం సభ్యులు ఎక్కువ సంఖ్యలో ఉన్న ప్రతి గ్రామంలో సామూహిక వివాహాలు ఏర్పాటు చేయనున్నారు. దీని వల్ల పెళ్లి ఖర్చులు ఆదా కానున్నాయి.