కరోనా మరణ మృదంగం దేశం నలుమూలలా వినిపిస్తూనే ఉంది. వందలు, వేలు కాదు రోజుకి లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. స్వయం నియంత్రణ ఎలాగూ లేదు.. పోనీ కోవిడ్ కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఖాతరు లేదు. . ఈ క్రమంలో ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. దీనిలో వందల మంది ఆడవాళ్లు నెత్తిన నీళ్ల బిందెలు పెట్టుకుని.. కరోనాను నాశనం చేయాలంటూ పాటలు పాడుతూ.. రోడ్డు మీదకు వచ్చారు.
వీరంతా ఒకరి మీద ఒకరు పడుతున్నట్లు చాలా దగ్గర దగ్గరగా నిల్చుని ఉన్నారు. వీరిలో చాలా మందికి మాస్క్ లేదు. కోవిడ్ విజృంభణ వేళ ఇంత మంది ఇలా ఒకే చోట గుంపుగా చేరడం కలకలం రేపింది. కరుణ రక్కసుని తరిమికొడతాం అంటూ రూల్స్ బేఖాతరు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవ్వడంతో అధికారులు రంగంలోకి దిగారు.
అహ్మదాబాద్ శివార్లలోని సనంద్ తాలూకా నవపురాలో ఈ హడావుడి జరిగింది. వందలాది మంది మహిళలు తలపై నీటి బిందెలతో బైల్యదేవ్ ఆలయానికి తరలివచ్చారు. పూనకాలతో ఊగిపోయారు. ఆ నీటి బిందెలను ఆలయ శిఖరంపైకి చేర్చి అభిషేకం చేశారు. బైల్యదేవ్ ఆలయంలో జలాభిషేకం చేస్తే కరోనా వైరస్ అంతరించిపోతుందని వారి నమ్మకం. రంగం లోకి దిగిన పోలీసులు సర్పంచ్ సహా నిర్వాహకులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు 23 మందిని అరెస్ట్ చేసారు.
కరోనాతో నవపురా గ్రామంలో ఇప్పటివరకు 90మంది మృతి చెందారు. మరోవైపు కరోనా విజృంభణతో గుజరాత్ వ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. నైట్ కర్ఫ్యూతోపాటు ఆంక్షలు అమలులో ఉన్నాయి. కేసులు పెరుగుతుండటంతో ఈ ఆంక్షలను మే 12వరకు పొడిగించింది ప్రభుత్వం. అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్ వంటి ప్రధాన నగరాల్లో రెస్టారెంట్లు, స్విమ్మింగ్ పూల్స్, థియేటర్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు మూసివేశారు.