గుజరాత్ రాష్ట్రంలోని వడ్గామ్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీని అసోం పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో బనస్కాంత జిల్లాలోని పాలన్‌పూర్ సర్క్యూట్ హౌస్ వద్ద ఎమ్మెల్యేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ట్వీట్ పై చెలరేగిన వివాదంలో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తొలుత అహ్మదాబాద్ తరలించారు. అక్కడి నుంచి గురువారం ఉదయం గుహవాటి తీసుకువెళ్లారు.
మేవానీని అరెస్ట్ చేసినట్లు అసోం పోలీసులు ధ్రృవీకరించారు. రెండు వర్గాల మధ్య శత్రుత్వం సృష్టించేందుకు కుట్ర పన్నడం, సమాజాన్ని అవమానించడం, శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగించడం వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద అసోం పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. ఈ ఏడాది చివర్లో గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిగ్నేష్‌ను అరెస్టు చేయడం పట్ల పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
జిగ్నేష్ మేవానీ.. వడ్గామ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతేడాది సెప్టెంబర్‌లో ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. అనంతరం రాహుల్ గాంధీతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతున్నానని ప్రకటించారు.