గుజరాత్‌లో ఘోరం.. గేమ్‌జోన్‌ ఘటనలో 27కి పెరిగిన మృతులు

గుజరాత్‌లో శనివారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on  26 May 2024 6:42 AM IST
gujarat, rajkot, gamezone, fire accident, 27 deaths ,

 గుజరాత్‌లో ఘోరం.. గేమ్‌జోన్‌ ఘటనలో 27కి పెరిగిన మృతులు

గుజరాత్‌లో శనివారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. వేసవి సెలవులు.. వీకెండ్‌.. సాయంత్రం వేళ కావడంతో సరదాగా గడిపేందుకు పిల్లలతో కలిసి చాలా మంది తల్లిదండ్రులు రాజ్‌కోట్‌లోని గేమ్‌ జోన్‌కు వెళ్లారు. అయితే.. అక్కడ చెలరేగిన మంటల్లో చిక్కుకుని పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. శనివారం రాత్రి 11 గంటల వరకు 27 మృతదేహాలను సిబ్బంది బయటకు తీశారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. పలువురికి తీవ్ర గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

కాగా.. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ నగరంలో శనివారం సాయత్రం 4.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. టీఆర్‌పీ గేమ్‌ జోన్‌లో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. దాంతో.. మంటల్లో చిక్కుకుని చిన్నారులు.. పెద్దలు కూడా సజీవదహనం అయ్యారు. తీవ్రంగా కాలిపోవడం వల్ల మృతదేహాలను కూడా గుర్తించడం కష్టంగా మారిందని అధికారులు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదని రాజ్‌కోట్‌ కలెక్టర్ చెప్పారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామనీ.. అలాగే ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఇక భారీ మంటలు ఎగిసిపడ్డ సమయంలో టీఆర్‌పీ గేమ్‌జోన్‌ కప్పుగా ఉన్న ఫైబర్ డోమ్‌ కుప్పకూలిందని తెలిపారు. ఆ సమయంలో అందరూ వివిధ ఆటల్లో నిమగ్నమై ఉన్నారని చెప్పారు.

ఇక టీఆర్పీ గేమ్‌జోన్‌ యువరాజ్‌సింగ్‌ సోలంకి అనే వ్యక్తి పేరుమీద ఉందనీ రాజ్‌కోట్‌ పోలీస్‌ కమిషనర్ రాజు భార్గవ్ చెప్పారు. శిథిలాల తొలగింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని అన్నారు. నగరంలోని ఇతర గేమ్‌జోన్‌లను మూసివేయాలని ఇప్పటికే ఆదేశించామన్నారు. దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేశామనీ.. మరోవైపు ఈ గేమ్‌జోన్ యజమాని యువరాజ్‌సింగ్ సోలంకి, మేనేజర్ నితిన్‌ జైన్‌ సహా ముగ్గురిని అరెస్ట్ చేశామని సీపీ రాజు భార్గవ్ చెప్పారు.

రాజ్‌కోట్‌ గేమ్‌జోన్ అగ్నిప్రమాద సంఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. రాష్ట్ర సీఎం భూపేంద్ర భాయ్‌ పటేల్‌తో ప్రధాని మోదీ మాట్లాడి సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు సీఎం భూపేంద్రభాయ్‌ పటేల్ ప్రకటించారు. గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున పరిహారం ఇవ్వన్నట్లు చెప్పారు.

Next Story