ఆన్‌లైన్లో ఆర్డర్ చేసిన పార్శిల్ బ్లాస్ట్, ఇద్దరు మృతి
గుజరాత్‌లో ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన పార్శిల్ ఇంటి వద్ద ఓపెన్ చేయగానే పేలిపోయింది. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 2 May 2024 5:30 PM ISTఆన్‌లైన్లో ఆర్డర్ చేసిన పార్శిల్ బ్లాస్ట్, ఇద్దరు మృతి
ఈ మధ్య కాలంలో చాలా వరకు వస్తువులను ఆన్‌లైన్‌లోనే కొనేస్తున్నారు ప్రజలు. నగరాల్లో ఉన్న ప్రజలే కాదు.. గ్రామాల వరకు ఆన్‌లైన్ డెలివరీలు అందుబాటులోకి వచ్చేశాయి. దాంతో.. ఆన్‌లైన్‌లో రకరకాల వస్తువులు అందుబాటులో ఉండటం.. నచ్చిన వాటిని ఎంపిక చేసుకుని ఆర్డర్ పెట్టేస్తున్నారు. కొన్నిసార్లు ఆన్‌లైన్‌లో బుక్ చేసిన వస్తువు ప్లేస్‌లో మరోటి రావడం వంటివి జరుగుతుంటాయి. కానీ.. తాజాగా ఓ ఆన్‌లైన్ పార్శల్ గుజరాత్‌లో కలకలం రేపింది. ఇంటికి వచ్చిన పార్శిల్‌ను ఓపెన్ చేయగానే అది పేలిపోయింది.
గుజరాత్‌లోని వడాలిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతులు తండ్రి, కూతుళ్లుగా పోలీసులు నిర్ధారించారు. ఆన్‌లైన్‌లో తండ్రి ఆర్డర్ చేసిన పార్శిల్ ఇంటికి వచ్చింది. బుధవారం ఆ పార్శిల్‌ను ఓపెన్ చేయగానే వెంటనే పేలిపోయింది. ఈ ఘటనలో జితేంద్ర హీరాభాయ్ వంజారా, ఆయన కుమార్తె భూమిక వంజారా ప్రాణాలు కోల్పోయారు. ఇదే ఘటనలో 9, 10 ఏళ్ల వయసు ఉన్న మరో ఇద్దరు కుమార్తెలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టిన పార్శిల్ ఇంటి వద్ద పేలిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఇద్దరు మృతిచెందడంతో పాటు.. మరో ఇద్దరు గాయపడటంతో స్థానికులు భాయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పార్శిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. బాంబు స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలను కూడా సేకరించారు. పార్శిల్‌ను ఎవరు డెలివరీ చేశారు..? అది పేలడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.