ప్ర‌ధాని వ‌స్తున్నార‌ని.. రాత్రికి రాత్రే ఆస్ప‌త్రికి రంగులు.. విప‌క్షాల విమ‌ర్శ‌లు

Gujarat Hospital's Overnight Clean-Up For PMs Visit after Bridge Tragedy.మోర్చీలోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిని రాత్రికిరాత్రే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Nov 2022 1:33 PM IST
ప్ర‌ధాని వ‌స్తున్నార‌ని.. రాత్రికి రాత్రే ఆస్ప‌త్రికి రంగులు.. విప‌క్షాల విమ‌ర్శ‌లు

గుజ‌రాత్ రాష్ట్రంలోని మోర్బి జిల్లాలో ఆదివారం సాయంత్రం కేబుల్ బ్రిడ్జి కూలి 134 మంది ప్రాణాలు కోల్పోగా చాలా మంది గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. నేడు( మంగ‌ళ‌వారం) ఘ‌ట‌నాస్థ‌లానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ వెళ్ల‌నున్నారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న క్ష‌త‌గాత్రుల‌ను ప‌రామ‌ర్శించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఇన్నాళ్లు స‌మ‌స్య‌ల వ‌ల‌యంగా ఉన్న మోర్చీలోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిని రాత్రికి రాత్రే బాగుచేసే ప్ర‌య‌త్నాలు చేశారు. లోపాల‌ను స‌రిచేయడంతో పాటు మెరుగులు దిద్దారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ మార‌గా.. ప‌లువురు తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. "ఆస్పత్రికి కొత్త‌గా రంగులు వేస్తున్నారు. టైల్స్ మారుస్తున్నారు. పాడైపోయిన పరిక‌రాల‌ను బాగు చేయించ‌డం వంటి ప‌నుల్లోనే నిమ‌గ్నం అయ్యారు. వారికి సిగ్గుగా అనిపించ‌డం లేదా..? ఎంతో మంది చ‌నిపోతే వారు మాత్రం ఓ ఈ వెంట్ కోసం సిద్ద‌మ‌వుతున్నారు "అని కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డింది.

134 మంది చ‌నిపోయారు. ప‌లువురు గ‌ల్లంతు అయ్యారు. ఈ ఘ‌ట‌న కార‌ణ‌కుల‌పై ఇంత వ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. అయితే.. బీజేపీ కార్య‌క‌ర్త‌లు మాత్రం ఫోటోషూట్ కోసం ఆస్ప‌త్రిని సిద్దం చేస్తున్నారు అని ఆమ్ అద్మీ(ఆప్‌) దుయ్య‌బ‌ట్టింది.

రాత్రిపూట రంగులు వేస్తున్నారు. కాబట్టి ప్రధాని మోడీ ఫోటోషూట్ సమయంలో ఆస్పత్రి భవనం అధ్వాన్నమైన పరిస్థితి బయటి ప్రపంచానికి కనిపించకుండా ఉంటుంది. ఈ అలంక‌ర‌ణ‌కు బ‌దులుగా బాధితుల‌కు మెరుగైన చికిత్స అందేలా చూడాల‌ని విప‌క్షాలు మండిప‌డుతున్నాయి.

Next Story