కరోనా ప్రపంచాన్ని కాకావికలం చేస్తోంది అన్నది అతిశయోక్తి కాదు. రోగులతో ఆస్పత్రుల్లో బెడ్స్ ఖాళీ లేవు.. పెరుగుతున్న మరణాలతో శ్మశానాల్లో ఖాళీ లేదు. అయితే కరోనా రోగుల కోసం కష్టపడే ప్రతి ఒక్కరిని ఇప్పటివరకు కరోనా వారియర్స్ గా గుర్తించారు గాని ఎలాంటి గుర్తింపుకు నోచుకోనివారు, ప్రాణాలు పణంగా పెట్టి తమ ధర్మాన్ని నిర్వహిస్తున్న వారు ఎవరంటే కాటి కాపారులే. ఇటు సహజ మరణాలు, అటు కోవిడ్ మృతులతో శ్మశానాలకు తాకిడి పెరుగుతోంది. గతంలో రోజుకు పది మృతదేహాలు వచ్చే శ్మశానాలకు ఇప్పుడు 70 నుంచి 100 వస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.
దీంతో కాటికాపరి లకు రిస్క్ తో పాటూ పని పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. కాటికాపరులను కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించింది. విధుల్లో వారు మరణిస్తే వారి కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం ప్రకటించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి దీనిని అమలు చేయనున్నారు. అంతే కాదు గుజరాత్ లో మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు కరోనా బారిన పడితే వారి చికిత్సకు మా కార్డు, వాత్స్యల్య కార్డుల కింద ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య చికిత్స అందిస్తామని ప్రకటించారు. దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో గుజరాత్ కూడా ఉంది.