మరో మాయదారి రోగం.. ఒకరు మృతి.. 100 దాటిన కేసుల సంఖ్య.. ఒక్కో ఇంజెక్షన్ ధర రూ. 20,000.. ఆందోళనలో జనం
మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఒక అనుమానాస్పద మరణంతో పూణేలో గులియన్-బారే సిండ్రోమ్ (GBS) కేసుల సంఖ్య 100 దాటిందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం ధృవీకరించింది.
By Medi Samrat Published on 27 Jan 2025 10:39 AM ISTమరో మాయదారి రోగం.. ఒకరు మృతి.. 100 దాటిన కేసుల సంఖ్య.. ఒక్కో ఇంజెక్షన్ ధర రూ. 20,000.. ఆందోళనలో జనం
మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఒక అనుమానాస్పద మరణంతో పూణేలో గులియన్-బారే సిండ్రోమ్ (GBS) కేసుల సంఖ్య 100 దాటిందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం ధృవీకరించింది. మృతుడు సోలాపూర్‌కు వెళ్లే ముందు పూణేలో ఇన్‌ఫెక్షన్ బారిన పడి ఉండవచ్చని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. నిన్న మొత్తం 28 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 101కి చేరుకుంది.
ధృవీకరించబడిన కేసులలో 16 మంది రోగులు ప్రస్తుతం వెంటిలేటర్ మద్దతుపై ఉన్నారు. కేసుల విశ్లేషణ ప్రకారం.. 19 మంది రోగులు తొమ్మిది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు కాగా.. 23 మంది 50-80 ఏళ్ల వయస్సులో ఉన్నవారు. 68 మంది రోగులు పురుషులు, 33 మంది స్త్రీలు ఉన్నారు.
అధికారులు నీటి కాలుష్యం, సంక్రమణపై దృష్టి సారించారు. నీటి నమూనాలపై నిర్వహించిన పరీక్షల్లో పూణేలోని ప్రాథమిక నీటి వనరు అయిన ఖడక్వాస్లా డ్యామ్ సమీపంలోని బావిలో ఈ.కోలి బ్యాక్టీరియా అధిక స్థాయిలో ఉన్నట్లు తేలింది.
అయితే.. ఆ బావి వినియోగంలో ఉందో లేదో అనే విషయమై అనిశ్చితి ఉంది. వినియోగానికి ముందు నీటిని మరిగించి.. ఆహారం వండుకోవాలని నివాసితులకు అధికారులు సూచించారు. అంటువ్యాధి మూలాలను కనుగొనే ప్రయత్నంలో ఆరోగ్య శాఖ అధికారులు 25,578 కుటుంబాలను సర్వే చేశారు.
మొదటి అనుమానిత GBS కేసు జనవరి 9న ఆసుపత్రిలో చేరింది. ఆసుపత్రిలో చేరిన రోగుల నుండి తీసుకున్న జీవ నమూనాలలో క్యాంపిలోబాక్టర్ జెజుని బ్యాక్టీరియా ఉనికి ఉన్నట్లు పరీక్షలలో తేలింది. ఈ బాక్టీరియా అధికంగా GBS ఇన్ఫెక్షన్‌లకు కారణమవుతుంది.
GBS చికిత్స ఖర్చుతో కూడుకున్నది. ఒక్కో ఇమ్యునోగ్లోబులిన్ (IVIG) ఇంజెక్షన్ ధర సుమారు రూ. 20,000. రోగులకు తరచుగా పలు ఇంజెక్షన్లు అవసరమవుతాయి. ఇది రోగి ఆర్థిక భారాన్ని గణనీయంగా పెంచుతుంది. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ స్పందిస్తూ.. “చికిత్స ఖరీదైనది, జిల్లా పరిపాలన, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో చర్చించిన తర్వాత.. మేము ఉచిత చికిత్స అందించాలని నిర్ణయించుకున్నాము. పింప్రి-చించ్‌వాడ్‌కు చెందిన వారు YCM ఆసుపత్రిలో చికిత్స పొందుతారు. పూణే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రోగులు కమ్లా నెహ్రూ ఆసుపత్రిలో చికిత్స పొందుతారు. గ్రామీణ ప్రాంతాల పౌరులకు, పూణేలోని సాసూన్ ఆసుపత్రిలో ఉచిత చికిత్స అందించబడుతుందని తెలిపారు.