కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరువు భత్యాన్ని మూడు శాతం పెంచారు. గురువారం జరిగిన కేంద్ర కేబినేట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఉద్యోగులకిచ్చే డీఏ, పెన్షనర్లకు ఇచ్చే డీఆర్‌ను 3 శాతం పెంచుతున్నట్లు తెలిపారు. ఇది జులై 1, 2021 నుంచే అమలవుతుందన్నారు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న డీఏ 28 శాతం ఉండగా.. తాజా పెంపుతో 31 శాతానికి చేరుకుంది. డీఏ, డీఆర్ పెంపు వల్ల 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. తాజా పెంపు వల్ల ఖజానాపై ఏడాదికి దాదాపు రూ. 9,488.70 కోట్ల ఆర్థిక భారం పడనుంది. డీఏ పెంపు నిర్ణయంపై ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. భారత్ 100 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ మోతాదుల మైలురాయిని నేడు అధిగమించిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో సవాళ్లను అధిగమించి ఈ ఘనత సాధించామన్నారు.