పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి బీబీసీ చేస్తున్న కవరేజ్ పై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కశ్మీర్‌లో ఘోరమైన దాడి తర్వాత పాకిస్తాన్ భారతీయులకు వీసాలను నిలిపివేసిందనే శీర్షికతో బీబీసీలో వచ్చిన వ్యాసంలో ఉగ్రవాద దాడిని "మిలిటెంట్ దాడి"గా పేర్కొంది. దీనిపై నరేంద్ర మోదీ ప్రభుత్వం బీబీసీ ఇండియా హెడ్ జాకీ మార్టిన్‌కు లేఖ రాసింది. బీబీసీకి రాసిన అధికారిక లేఖలో, విదేశాంగ మంత్రిత్వ శాఖ బీబీసీ నివేదికలను పర్యవేక్షిస్తుందని భారత ప్రభుత్వం పేర్కొంది.
పహల్గామ్ ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలోని భారతీయులు భారీగా నిరసనలు నిర్వహించారు. కెనడా, డెన్మార్క్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఫిన్లాండ్, జర్మనీ, స్పెయిన్, యుఎస్‌లలో ఈ ప్రదర్శనలు జరిగాయి. బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ప్లకార్డులు పట్టుకుని, పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలు చేస్తూ, భారత జెండాలను ఊపారు.