దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, రక్షణ, భద్రత, ప్రయోజనాల దృష్ట్యా గతేడాది జూన్‌లో టిక్‌టాక్ సహా చైనాకు చెందిన 59 యాప్‌లను, సెప్టెంబర్‌లో పబ్జీతో పాటు మరో 118 యాప్‌లను నిషేదిస్తూ.. కేంద్రం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఈ నిషేదాన్ని కేంద్రం పొడిగించింది. ఈ మేరకు టిక్‌టాక్‌తో పాటు నిషేధం విధించిన అన్ని కంపెనీలకు, యాజమాన్య సంస్థలకు కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది.
తమపై నిషేధం ఎత్తివేయాలని పలు కంపెనీలు కేంద్రాన్ని కోరిన నేపథ్యంలో కేంద్రం ఈ సమాచారం ఇచ్చింది. కాగా.. దీనిపై టిక్‌టాక్ స్పందించింది. భారత చట్టాలు, నిబంధనలను పాటించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. వినియోగదారుల గోప్యతే తమ తొలి ప్రాధాన్యమని టిక్‌టాక్ పేర్కొంది. భద్రత విషయంలో ప్రభుత్వానికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే పరిష్కరించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపింది.