రైతులకు ఈ యూనిక్ ఐడీతోనే ప్రభుత్వ పథకాలు!
వ్యవసాయ రంగంలో అన్నదాతల సంక్షేమం, సాగుకు పెట్టుబడి సాయం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథఖాలను అమలు చేస్తున్నాయి.
By అంజి Published on 16 Feb 2025 10:56 AM IST
రైతులకు ఈ యూనిక్ ఐడీతోనే ప్రభుత్వ పథకాలు!
వ్యవసాయ రంగంలో అన్నదాతల సంక్షేమం, సాగుకు పెట్టుబడి సాయం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథఖాలను అమలు చేస్తున్నాయి. ఈ పథకాలను అర్హులకు మాత్రమే అందేలా, అనర్హులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. దీనిలో భాగంగా నిజమైన లబ్ధిదారులకు మేలు జరిగేలా, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ఆధునీకరించేందుకు రైతులకు ఆధార్ కార్డ్ తరహాలో ఒక యూనిక్ ఐడీని కేంద్రం జారీ చేస్తోంది. ఫార్మర్ రిజిస్ట్రీ పేరిట ప్రతి రైతుకు నిర్దిష్ట గుర్తింపు సంఖ్య ఇచ్చే ప్రక్రియ అనేక రాష్ట్రాల్లో ప్రారంభమైంది. దీనిలో భాగంగా ఏపీలోని అనేక జిల్లాల్లో అన్నదాతల వివరాల సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతీ రైతు (సొంత భూమి ల రైతులు మాత్రమే) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాలు, రాయితీలు పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా చేయించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి.
ఎక్కడ నమోదు చేస్తున్నారు?
ఏపీలోని రైతులు తమ సమీపంలోని రైతు సేవా కేంద్రాలు (ఆర్‌ఎస్‌కే)కు వెళ్లాలి. సొంత భూమి ఉన్న ప్రతి రైతు ఈ పథకానికి అర్హుడే.
కావాల్సిన పత్రాలు
పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్
ఆధార్ జిరాక్స్
ఆధార్ నంబర్ లింక్ అయిన ఫోన్ నెంబర్ ఉన్న ఫోన్ తీసుకొని రైతు సేవా కేంద్రానికి వెళ్లాలి.
నమోదు ప్రక్రియ
రైతు సేవా కేంద్రం సిబ్బంది రైతుల సమక్షంలోనే ఈ విశిష్ట సంఖ్య కోసం కంప్యూటర్‌లో నమోదు చేస్తారు. నిర్దేశిత పోర్టల్‌లో రైతు భూమి వివరాలు, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ వివరాలు నమోదు చేస్తారు. ఈ నమోదు పూర్తి కాగానే రైతుల మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని రైతు సేవా కేంద్రం సిబ్బందికి తెలియజేస్తే నమోదు ప్రక్రియ పూర్తై రైతులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు.
విశిష్ట గుర్తింపు సంఖ్యతో లాభాలు
రైతులకు జారీ చేసే ఈ గుర్తింపు సంఖ్యతో అనేక లాభాలు ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అనర్హులకు అడ్డుకట్టవేసి.. అర్హులకు ప్రభుత్వ పథకాలు, రాయితీలు ఇతర వ్యవసాయ సేవలు అందించడానికి ఈ గుర్తింపు సంఖ్య ఉపయోగపడుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఈ విశిష్ట సంఖ్య ద్వారా పథకాలకు అర్హులైన రైతుల గుర్తింపు సులభతరం కానుందని కేంద్రం చెబుతుంది. అలాగే పీఎం కిసాన్ యోజన, అన్నదాత సుఖీభవ, పంటల బీమా, వ్యవసాయ పరికరాల రాయితీలు, పంట నష్టపరిహారం, పెట్టుబడి, ఎరువుల రాయితీలు, కనీస మద్ధతు ధర, పంటల రుణాలు పొందే ప్రక్రియకు ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య మరింత సులభతరం చేయనుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.