ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులపై కేంద్ర ప్రభుత్వం నిషేదం విధించింది. ఉపయోగం తక్కువగా ఉంటూ, చెత్తగా పోగుపడే అవకాశం అధికంగా ఉన్న వస్తువుల తయారీ, నిల్వ, దిగుమతి, పంపిణీ, అమ్మకం, వినియోగాలపై విధించిన ఈ నిషేధం జులై 1, 2022 నుంచి అమల్లోకి రానున్నట్లు శనివారం కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, బెలూన్లు, ఇయర్ బడ్స్, క్యాండీ, ఐస్‌క్రీం కోసం వాడే ప్లాస్టిక్ పుల్లలు, చెంచాలు, కత్తులు, ట్రేలు, ప్లాస్టిక్ స్వీట్‌బాక్స్‌లు, ఆహ్వాన పత్రాలు, సిగరెట్ ప్యాకెట్లు, 100 మైక్రాన్‌లలోపు ఉండే పీవీసీ బ్యానర్లు, అలంకరణ కోసం వాడే పాలిస్ట్రైరిన్ (థర్మాకోల్) వంటి 16 రకాల ప్లాస్టిక్ వస్తువులు నిషేదించిన వాటిలో ఉన్నాయి.
పెట్రో కెమికల్ సంస్థలు.. ఒకసారి వాడిపారేసే వస్తువులను తయారు చేసే పరిశ్రమలకు ముడి సరుకును సరఫరా చేయవద్దని ఇప్పటికే కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇక వాణిజ్య సంస్థలు తమ పరిధిలో ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ ఉపయోగించరాదని షరతు విధిస్తూ.. స్థానిక సంస్థల లైసెన్సులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లగించిన వారి లైసెన్సును రద్దు చేయాలని అందులో పేర్కొంది. ప్రధానమంత్రి పిలుపు మేరకు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది.