నిబంధనలకు ఫేస్‌బుక్ గ్రీన్ సిగ్నల్.. స్పందించని ట్విట్టర్
Google and Facebook says ready to comply with revised IT rules.కొత్త ఐటీ నియమ నిబంధనలు పాటించడానికి దిగ్గజ సామాజిక సంస్థలు ఫేస్‌బుక్, గూగుల్‌లు సూత్రపాయంగా అంగీకరించాయి.
By తోట వంశీ కుమార్ Published on 26 May 2021 7:47 AM IST
సామాజిక, డిజిటల్ మాధ్యమాల్లోని కంటెంట్‌ను నియంత్రించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో 'కోడ్ ఆఫ్ ఎథిక్స్' పేరిట కొన్ని నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. వీటిని అమలు చేయడానికి కేంద్రం ఆయా సంస్థలకు మూడు నెలల గడువు ఇవ్వగా.. ఆ గడువు నిన్నటితో ముగిసింది. కొత్త ఐటీ నియమ నిబంధనలు పాటించడానికి దిగ్గజ సామాజిక సంస్థలు ఫేస్‌బుక్, గూగుల్‌లు సూత్రపాయంగా అంగీకరించాయి. వీటి అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించాయి. అయితే.. ట్విట్టర్ నుంచి మాత్రం దీనిపై ఎటువంటి స్పందన లేదు. బుధవారం నుంచి కేంద్ర పభ్రుత్వ కొత్త నిబంధనలు పూర్తి స్థాయిలో అమలు కానున్నాయి.
ఫేస్‌బుక్ ఏమని చెప్పిందంటే..?
కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను అమలు చేయడమే తమ లక్షమని ఫేస్‌బుక్ మంగళవారం ప్రకటించింది. నిబంధనలను అమలు చేసే ప్రక్రియ పై కసరత్తు కొనసాగిస్తున్నట్లు చెప్పింది. సామర్థ్యాలను మెరుగుపరచుకుంటామని.. అయితే.. అంశాలపై మరింత భాగస్వామ్యం కోసం ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తాస్తున్న వెల్లడించింది. ప్రజలు స్వేచ్చగా తమ బావాలు వ్యక్తం చేసేందుకు వేదికగా నిలిచేందుకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. ఇక గూగుల్ మాత్రం నేరుగా చెప్పకుండా తమ కంపెనీ ఉత్పత్తుల్లో మార్పులు తెస్తున్నాం. చట్టవిరుద్దమైన కంటెంట్‌ను అడ్డుకోవడానికి ఆయా దేశాల చట్టాలను అనుసరిస్తూ, వనరులను సిబ్బందిని సమర్థవంతంగా వినియోగిస్తాం అని పేర్కొంది.
పాటించకుంటే ఏం జరుగుతుందంటే..?
ఈ నిబంధనలు పాటించకుంటే ఇన్నాళ్లు వాటికి రక్షణ కుడ్యంగా నిలుస్తున్న మధ్యవర్తి హోదా రద్దవుతుంది. ఉదాహారణకు పేస్‌బుక్‌లో ఎవరైనా అభ్యంతరకరమైన సమాచారం పెడితే.. దాన్ని తమ వేదికపై ప్రచారం చేసినా ఫేస్‌బుక్‌కు ఏమీ కాలేదు. పోస్టు పెట్టిన వారిపై క్రిమనల్ లేదా ఇతరత్రా చర్యలు ఆస్కారం ఉండేది. మధ్యవర్తి హోదానే అందుకు కారణం. ఇప్పుడు అది రద్దు అవుతుంది. దీంతో పేస్‌బుక్ పైనే నేరుగా క్రిమినల్ కేసులు, ఇతరత్రా చర్యలు తీసుకోనున్నారు.
నిబంధనలో కొన్ని..
- సోషల్ మీడియాలో తమతమ ప్లాట్‌ఫామ్‌లపై పోస్ట్ అయ్యే సమాచారం విషయంలో అత్యంత జాగరూకతతో ఉండాలి.
- వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి సోషల్ మీడియా సంస్థలు ఒక అధికారిని నియమించాలి.
-ఫిర్యాదు అందిన 24 గంటల్లోగా అధికారి ఆ విషయా న్ని వారికి తెలియజేయాలి. 15 రోజుల్లోగా పరిష్కరించాలి.
- సోషల్ మీడియా సంస్థలు చట్టాలు, నిబంధనల ప్రకారం నడుచుకునేలా చూడడం కోసం 'చీఫ్ కంప్లయన్స్ అధికారి'ని నియమించాలి.
- పోలీసులు, సీబీఐ వంటి లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు 24 గంటలూ అందుబాటులో ఉండే లా 'నోడల్ కాంటాక్ట్ పర్సన్'ను నియమించాలి.
-ఫిర్యాదుల పరిష్కారాల కోసం రెసిడెంట్ గ్రీవన్స్ అధికారిని నియమించాలి. వీరంతా భారత్‌లో నివసించేవారై ఉండాలి. ఇలా కొన్ని నిబంధనలను కేంద్రం విధించింది.