టాయిలెట్ నిర్మాణానికి గుంత తవ్వుతుండగా బయటపడ్డ బంగారు నాణేలు.!
Gold coins found during excavation in Uttar Pradesh's Jaunpur. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో బ్రిటిష్ పాలనా కాలం నాటి బంగారు నాణేలు లభ్యమయ్యాయి.
By అంజి Published on 18 July 2022 6:35 AM GMTఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో బ్రిటిష్ పాలనా కాలం నాటి బంగారు నాణేలు లభ్యమయ్యాయి. జౌన్‌పూర్ జిల్లా కొత్వాలి ప్రాంతంలోని మచాలీ షహర్‌లోని కజియానా మొహల్లాలో నివాసముంటున్న నూర్‌జహాన్ అనే మహిళ తన ఇంట్లో టాయిలెట్ కోసం కూలీలతో గుంత తవ్విస్తుండగా ఈ నాణేలు బయటపడ్డాయి. ఈ నెల 12 జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం బయటకు పొక్కకుండా కుటుంబ సభ్యులు, కూలీలు జాగ్రత్త పడ్డారు.
అయితే ఎలాగోలా ఈ సమాచారం పోలీసులకు చేరింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శనివారం నాణేలను స్వాధీనం చేసుకున్నారు. నాణేలు బ్రిటిష్ సామ్రాజ్యానికి చెందినవి (1889-1912 మధ్య) అని తేలింది. కూలీలను పోలీసులు విచారిస్తున్నారు. కొందరు కూలీలు కూడా పరారీలో ఉన్నట్లు సమాచారం. ఇమామ్ అలీ రైనీ భార్య నూర్‌జహాన్ మంగళవారం మరుగుదొడ్డి నిర్మాణం కోసం గొయ్యి తవ్వుతుండగా ఇది జరిగింది.
గుంత తవ్వుతుండా ఒక రాగి పాత్ర కనబడింది. అందులో కొన్ని బంగారు నాణేలు కనిపించాయి. ఆ తర్వాత కూలీలు నాణేల కోసం తమలో తాము గొడవపడ్డారు. రైనీ కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. కూలీలు పనులు మధ్యలోనే వదిలేశారు. మరుసటి రోజు, కూలీలు తిరిగి వచ్చి దురాశ కారణంగా మళ్లీ గుంత తవ్వడం ప్రారంభించారు. అయితే, ఓ కూలీ రైనీని తనకు బంగారు నాణేలు కావాలని డిమాండ్ చేశాడు. దీంతో కూలీకి ఒక బంగారు నాణెం ఇచ్చాడు.
బుధవారం సాయంత్రానికి ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. పోలీసులు రైన్ కుమారుడితో కూలీల వద్దకు వెళ్లి విచారించారు. కార్మికులు మొదట అలాంటి సంఘటనేమీ జరగలేదని చెప్పారు. కానీ పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో వారు అంగీకరించారు.
కూలీలు 10 బంగారు నాణేలను పోలీసులకు ఇచ్చారు. అసలు రాగి పాత్రలో ఎన్ని నాణేలు దొరికాయన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కూలీలను పోలీసులు విచారిస్తున్నారు. ''సంఘటనా స్థలానికి వెళ్లాను.. కూలీలను సంప్రదించగా మొత్తం 10 నాణేలు లభ్యమయ్యాయి. నాణేలన్నీ ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యాయి. కూలీలను విచారిస్తున్నాం'' అని మచ్లి షహర్ అధికారి అతర్ సింగ్ తెలిపారు.