గోవా అగ్ని ప్రమాదం.. నైట్‌క్లబ్ సహ యజమాని అజయ్ గుప్తా అరెస్టు

గోవాలో 25 మంది ప్రాణాలు కోల్పోయిన భీభత్స అగ్ని ప్రమాదానికి కారణమైన ‘బర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

By -  అంజి
Published on : 10 Dec 2025 10:23 AM IST

Goa, nightclub co-owner, Ajay Gupta, detained, fire

గోవా అగ్ని ప్రమాదం.. నైట్‌క్లబ్ సహ యజమాని అజయ్ గుప్తా అరెస్టు

గోవాలో 25 మంది ప్రాణాలు కోల్పోయిన భీభత్స అగ్ని ప్రమాదానికి కారణమైన ‘బర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సహయజమానుల్లో ఒకరైన అజయ్ గుప్తాను గోవా పోలీసులు మంగళవారం ఢిల్లీలో నిర్బంధించారు. ఘటన జరిగిన తర్వాత అజయ్ గుప్తా పరారీలో ఉండటంతో, ఆయనపై లుకౌట్ సర్క్యులర్‌ జారీ చేసిన నేపథ్యంలో ఈ చర్య జరిగింది.

గోవా పోలీసు ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. “నైట్‌క్లబ్ యజమానుల్లో ఒకరైన అజయ్ గుప్తాను నిర్బంధించాం. ఈ కేసులో ఇప్పటివరకు పట్టుబడిన వారిలో ఆయన ఆరో వ్యక్తి. మా బృందం ఢిల్లీలోని ఆయన నివాసంలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో లుకౌట్ సర్క్యులర్‌ జారీ చేయాల్సి వచ్చింది. గోవాకు తరలించే ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆయనను అధికారికంగా అరెస్ట్ చేస్తాము” అని తెలిపారు.

ఇప్పటికే అరెస్ట్ అయిన అధికారులు, సిబ్బంది

డిసెంబర్ 7న అర్పోరా బీచ్‌లోని నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదం చీఫ్ జనరల్ మేనేజర్ రాజీవ్ మోదక్, జనరల్ మేనేజర్ వివేక్ సింగ్, బార్ మేనేజర్ రాజీవ్ సింఘానియా, గేట్ మేనేజర్ రియాన్షు ఠాకూర్, ఉద్యోగి భరత్ కోహ్లీలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

పరారీ యజమానులపై అంతర్జాతీయ నోటీసులు

సహయజమానుల్లో మరో వ్యక్తి సురిందర్ కుమార్ ఖోస్లాపై కూడా లుకౌట్ సర్క్యులర్‌ జారీ చేశారు. ఇద్దరు యజమానులు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలు అగ్ని ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే ఢిల్లీ నుంచి థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌కి పారిపోయినట్లు గుర్తించారు. వీరి మీద బ్లూ కార్నర్ నోటీస్ జారీ అయింది. పరారీలో ఉన్నప్పటికీ, సౌరభ్ లూథ్రా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో బాధితులకు సంతాపం తెలుపుతూ.. “ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిపట్ల లోతైన సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. గాయపడినవారితో పాటు వారి కుటుంబాలకు మేము అండగా ఉంటాం” అని రాశాడు.

మరో రోమియో లేన్ ప్రాపర్టీ కూల్చివేత

అగ్ని ప్రమాదం అనంతరం అధికారులు విచారణలో భాగంగా మరో రోమియో లేన్ ప్రాపర్టీ-వాగటర్ బీచ్‌లోని నిర్మాణం-అగ్ని భద్రతా నిబంధనలను ఉల్లంఘించడం మాత్రమే కాకుండా ప్రభుత్వ భూమిపై అక్రమంగా నిర్మించబడినట్లు గుర్తించారు. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆదేశాల మేరకు ఈ నిర్మాణాన్ని మంగళవారం బుల్డోజర్‌తో కూల్చివేశారు. గోవా నైట్‌క్లబ్ ప్రమాదంపై దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. పరారీ యజమానులపై అంతర్జాతీయ స్థాయిలో చర్యలు కొనసాగుతున్నాయి.

Next Story