టీకాపై గ్లోబల్ టెండర్లు.. సమయానికి అందించే కంపెనీలు ఉన్నాయా..?
Global e-tender for vaccines. పలు రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు వెళితే వ్యాక్సిన్లు రాష్ట్ర ప్రజలకు ఇవ్వొచ్చు అనే ఉద్దేశ్యంతో ఉన్నాయి.
By Medi Samrat Published on 19 May 2021 11:49 AM GMTభారత దేశంలో కరోనా ఉధృతిని అడ్డుకోవాలంటే ఒకే ఒక్క మార్గం.. వ్యాక్సిన్లను వేయడం..! ఇది శరవేగంగా జరగాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తూ ఉన్నాయి. పలు రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు వెళితే వ్యాక్సిన్లు రాష్ట్ర ప్రజలకు ఇవ్వొచ్చు అనే ఉద్దేశ్యంతో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం కూడా తాజాగా గ్లోబల్ టెండర్లకు వెళ్ళింది. కరోనా వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించాలని ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. అందుకు సంబంధించి గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తూ ప్రభుత్వం షార్ట్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్ల ద్వారా మొత్తం 10 మిలియన్ డోసుల వ్యాక్సిన్లను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. బిడ్ల దాఖలు కోసం జూన్ 4 చివరి తేదీగా ప్రకటించింది. ఆరు నెలల్లో 10 మిలియన్ డోసుల వాక్సిన్లను సరఫరా చేయాల్సి ఉంటుందని షరతు విధించింది. నెలకు 1.5 మిలియన్ డోసులు విధిగా సరఫరా చేయాల్సి ఉంటుందని స్పష్టంగా చెబుతోంది. తెలంగాణలో వ్యాక్సిన్లు తీసుకునే అర్హత ఉన్న వారందరికీ వ్యాక్సిన్లు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
భారతదేశంలో ఈ స్థాయిలో కరోనా వ్యాక్సిన్లు అందించే కంపెనీలు ఉన్నాయా లేదా అన్నది కూడా పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే చాలా కంపెనీలు అంత తొందరగా వ్యాక్సిన్లు ఇవ్వలేమని చేతులెత్తేశాయి. కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లకు డీజీసిఐ అనుమతి లభించింది. భారత్ బయోటెక్, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థలు తమ వ్యాక్సిన్లను దేశంలో తయారు చేస్తున్నాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ త్వరలోనే స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనుంది. వ్యాక్సిన్ల కొరత కారణంగా ప్రజలకు వ్యాక్సిన్లను అందించలేకపోతున్నామని పలు రాష్ట్రాలు ఇప్పటికే పిర్యాదులు చేశాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా తమకు తగినంత వ్యాక్సిన్లు రావడం లేదని చెప్పింది. అందుకే ఇప్పుడు గ్లోబల్ టెండర్లకు తెలంగాణ ప్రభుత్వం వెళ్ళింది.