సిగరెట్ తాగుతూ భారత జాతీయ గీతాన్ని అపహాస్యం చేసినందుకు కోల్‌కతాకు చెందిన ఇద్దరు బాలికలపై కేసు నమోదైంది. వీరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. వీడియో వైరల్ అయిన వెంటనే.. కలకత్తా హైకోర్టు న్యాయవాదితో సహా పలువురు నెటిజన్లు బాలికలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం బరాక్‌పూర్ సైబర్ సెల్‌లో జాతీయ గీతాన్ని అపహాస్యం చేసినందుకు ఇద్దరు బాలికలపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
ఇద్దరు బాలికల నుంచి వాంగ్మూలాలు నమోదు చేసినట్లు బరాక్‌పూర్ కమిషనరేట్ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. సంబంధిత డేటా కోసం దర్యాప్తు సంస్థ ఫేస్‌బుక్‌తో సంప్రదింపులు జరుపుతోందని అధికారి తెలిపారు. పోలీసు వర్గాల ప్రకారం.. వీడియో వైరల్ కావడంతో, సోషల్ మీడియాలో ఎదురుదెబ్బ తగలడంతో, అమ్మాయిలు ఫేస్‌బుక్ నుండి వీడియోను తొలగించారు. ఒక వీడియోలో, అమ్మాయిలు కూర్చుని, చేతిలో సిగరెట్‌తో జాతీయ గీతం పాడటం కనిపించింది. ఇద్దరు బాలికలు మైనర్లు అని సమాచారం.