తీహార్ జైలులో గ్యాంగ్ వార్
రాజధాని ఢిల్లీలోని తీహార్ జైలులో గ్యాంగ్ వార్ ఘటన వెలుగు చూసింది. రెండు ముఠాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ ఖైదీ కత్తిపోట్లకు గురయ్యాడు.
By Medi Samrat Published on 6 Jun 2024 12:44 PM ISTరాజధాని ఢిల్లీలోని తీహార్ జైలులో గ్యాంగ్ వార్ ఘటన వెలుగు చూసింది. రెండు ముఠాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ ఖైదీ కత్తిపోట్లకు గురయ్యాడు. తీహార్ జైలులో ప్రత్యర్థి ముఠా సభ్యుల మధ్య ఘర్షణ జరిగినట్లు పోలీసులు తెలిపారు. గోగి, టిల్లు గ్యాంగ్ సభ్యుల మధ్య జరిగిన గొడవలో.. ఓ హత్య కేసులో అండర్ ట్రయల్‌గా ఉన్న ఖైదీ కత్తిపోట్లకు గురయ్యాడని తెలిపారు. గాయపడ్డ ఖైదీని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ విషయమై ఓ అధికారి మాట్లాడుతూ.. బుధవారం ఉదయం 11.15 గంటల ప్రాంతంలో గోగి గ్యాంగ్‌కు చెందిన హితేష్‌కి, టిల్లు తాజ్‌పురియా గ్యాంగ్‌కు చెందిన మరో ఇద్దరు సభ్యులకు మధ్య గొడవ జరిగింది. ఇందులో ఖైదీ హితేష్ ఐస్ పిక్(పదునైన చువ్వ) లాంటి ఆయుధంతో పొడిచాడని తెలిపాడు.
ఢిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (వెస్ట్) విచిత్ర వీర్ మాట్లాడుతూ.. "హితేష్‌పై దాడి చేసిన వారి పేర్లు గౌరవ్ లోహ్రా, గురీందర్. హితేష్ గాయపడ్డాడు. DDU ఆసుపత్రిలో చికిత్స జరుగుతుందని వెల్లడించారు.
హితేష్ 2019 నుంచి జైలులో ఉండగా.. గౌరవ్, గురిందర్ హత్య, హత్యాయత్నం కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్నారు. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. గత ఏడాది మే నెలలో ఇదే జైలులో గ్యాంగ్‌స్టర్ తాజ్‌పురియాను ప్రత్యర్థి ముఠాలోని పలువురు కత్తులతో పొడిచి చంపారు.