పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవు.. ఎల్పీజీ కొరత లేదు : కేంద్రం

పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రజలకు హామీ ఇచ్చింది.

By -  Medi Samrat
Published on : 25 March 2026 5:40 PM IST

పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవు.. ఎల్పీజీ కొరత లేదు : కేంద్రం

పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రజలకు హామీ ఇచ్చింది. దేశంలో తగినంత ముడి చమురు నిల్వలు ఉన్నాయని, రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ విలేకరుల సమావేశంలో తెలిపారు. దేశ వార్షిక శుద్ధి సామర్థ్యం సుమారు 260 మిలియన్ టన్నులు అని.. పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి పెరుగుదల లేదని, ఏ పెట్రోల్ పంపు వద్ద కూడా కొరత లేదని ఆమె స్పష్టం చేశారు.

పెట్రోలియం టెర్మినళ్లలో కూడా తగినంత నిల్వలు ఉన్నాయని శర్మ తెలిపారు. వదంతులను నమ్మవద్దని, భయాందోళనలకు గురికావద్దని ఆమె ప్రజలను కోరారు. గత రెండు రోజులుగా కొన్ని ప్రాంతాల్లోని పెట్రోల్ పంపుల వద్ద పొడవైన క్యూలు, భయాందోళనలతో కొనుగోళ్లు కనిపించినప్పటికీ, ప్రభుత్వం పరిస్థితిని సాధారణంగానే అభివర్ణించింది.

ఎల్పీజీ విషయానికి వస్తే, ప్రభుత్వం వాణిజ్య ఎల్పీజీ పరిమాణాన్ని 20 శాతం నుంచి 50 శాతానికి పెంచింది. ఈ నిర్ణయం మార్చి 21న తీసుకోబడింది. రెస్టారెంట్లు, హోటళ్లు, పారిశ్రామిక క్యాంటీన్లు, వలస కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రాలను కోరారు.

ఇప్పటివరకు 26 రాష్ట్రాలకు సుమారు 22,000 టన్నుల వాణిజ్య ఎల్‌పిజిని కేటాయించారు. నిన్న మంగళవారం, సుమారు 30,000 5-కేజీల సిలిండర్లను జారీ చేశారు. గృహ వినియోగ ఎల్‌పిజికి కొరత లేదని, ఆన్‌లైన్ బుకింగ్‌లు 92 శాతం సామర్థ్యంతో జరుగుతున్నాయని శర్మ నొక్కి చెప్పారు. సరఫరా పూర్తిగా సాధారణంగా ఉంది.

పీఎన్‌జీ (పైపుల ద్వారా సహజ వాయువు) విస్తరణను ప్రోత్సహించేందుకు, ప్రభుత్వం మంగళవారం దరఖాస్తు రుసుములను, ఆమోద సమయాలను సులభతరం చేస్తూ మరో గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

గత 25 రోజుల్లో 2.5 లక్షల కొత్త పీఎన్‌జీ కనెక్షన్లు అందించగా, 2.2 లక్షల మంది వినియోగదారులు ఎల్‌పిజి నుంచి పీఎన్‌జీకి మారారని ప్రభుత్వం తెలిపింది. అలాగే 2.5 లక్షల కొత్త రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. గృహ వినియోగ పీఎన్‌జీ కనెక్షన్ల సరఫరా 100 శాతం ఉండేలా చూస్తున్నామని పేర్కొంది.

రవాణా కోసం కూడా CNGని పుష్కలంగా అందుబాటులోకి తెస్తున్నారు. అనేక కంపెనీలు ₹500 వరకు ఉచిత గ్యాస్ ఇవ్వడం లేదా సెక్యూరిటీ డిపాజిట్లను మాఫీ చేయడం వంటి ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.

పీఎన్‌జీ విస్తరణకు రాష్ట్రాలు సహకరిస్తే, వాటికి అదనంగా 10 శాతం వాణిజ్య ఎల్‌పిజిని అందించాలని కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది.

తీసుకుంటున్న అన్ని చర్యలూ సానుకూల ఫలితాలనిస్తున్నాయని శర్మ పేర్కొన్నారు. ప్ర‌జ‌లు వదంతులను పట్టించుకోకుండా, యథావిధిగా సిలిండర్లను బుక్ చేసుకోవాలని ఆమె కోరారు.

Next Story