రోడ్డు ప్రమాద బాధితులకు మొదటి 48 గంటలు ఉచిత వైద్యం
Free treatment for road accident victims for first 48 hours in Tamil Nadu.దేశంలో నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు
By తోట వంశీ కుమార్ Published on 19 Dec 2021 5:31 AM GMTదేశంలో నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సమయానికి వైద్యం అందకపోవడంతో నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడేందుకు ఓ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రాణాలను కాపాడుదాం(ఇన్నుయిర్ కాప్పోమ్) పేరిట ఓ కొత్తపథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం గాయపడిన వారికీ మొదటి 48 గంటల్లో ఉచిత వైద్యం అందించడమే. చెంగల్ పట్టు జిల్లా మేల్ మరువత్తూర్ లోని ఆదిపరాశక్తి వైద్య కళాశాలలో సీఎం స్టాలిన్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. ఇన్నుయిర్ కాప్పోమ్ నమైకాక్కుమ్ 48 పథకంలో భాగంగా.. ప్రమాదం జరిగిన మొదటి 48 గంటల్లో ఒక ప్రాణాన్ని కాపాడేందుకు అవసరమైన వైద్య ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరింస్తుందని చెప్పారు. బాధితునికి గరిష్టంగా లక్ష రూపాయల వరకు సాయం అందనున్నట్లు తెలిపారు. ఈ పథకంలో ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం లబ్ధిదారులు, సభ్యులు కానివారు అర్హులేనని అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి మొదటి 48 గంటలు కీలకమని బావించి ఈ పథకాన్ని ప్రారంభించినట్లు సీఎం తెలిపారు. ఇక ప్రమాద బాధితులకు చికిత్స అందించేందుకు 201 ప్రభుత్వ ఆస్పత్రులు, 408 ప్రైవేటు ఆస్పత్రులు సహా 610 ఆస్పత్రులను ప్రభుత్వం ఎంపిక చేసి వాటి వివరాలను వెల్లడించింది.
తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన నాటి నుంచి ఎం కె స్టాలిన్ వినూత్న, విలక్షణ నిర్ణయాలతో ముందుకు వెలుతున్నారు. మార్నింగ్ వాక్‌కు వెళ్లి సాధారణ ప్రజలతో మాట్లాడడం, వారితో సెల్పీలు దిగడం, వారి కష్టసుఖాలను తెలుసుకుంటున్నారు. సాధారణ వ్యక్తిలా ప్రతి చోట హఠాత్తుగా వెళ్లి పరీశీలన చేపట్టడం, ప్రజల్లో నిరంతరం ఉంటూ వారితో మమేకం అవుతున్నారు. కక్ష పూరిత రాజకీయాలకి బ్రేక్ వేస్తూ రోజు రోజుకీ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ కొత్త పథకాలను ప్రవేశ పెడుతున్నారు. స్టాలిన్ తీసుకునే నిర్ణయాలకు ప్రతిపక్ష నేతలు సైతం ప్రశంసలు కురిపించడం విశేషం.