ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఢిల్లీలోని సబ్జి మండి ఏరియాలో సోమవారం మధ్యాహ్నాం 12 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల సమాచారం మేరకు వెంటనే రెస్క్యూ బృందాలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. తీవ్రంగా గాయపడిన ఇద్దరు చిన్నారులతో పాటు ఓ వ్యక్తిని శిథిలాల కింద నుంచి వెలికి తీసి ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారులు ఇద్దరు మృత్యువాత పడినట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రమాదానికి గురైన ఈ భవనం సుమారు 75 ఏళ్ల నాటిదని అధికారులు అన్నారు. ఆ భవన యజమానిపై సెక్షన్ 304 కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇక భవన శిథిలాలు పార్క్ చేసిన కారుపై పడడంతో కారు పూర్తిగా ధ్వంసమైందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. మల్కాగంజ్ ప్రాంతంలో మరో 20 భవనాలు సైతం ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనపై సీఎం అరవింద్ క్రేజీవాల్ స్పందించారు. భవనం కూలిపోవడం బాధాకరమన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఏడు రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించింది.