తుదిశ్వాస విడిచిన ములాయం సింగ్​ యాదవ్

Former Uttar Pradesh's Mulayam Singh passed away. యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయంసింగ్‌ యాదవ్‌ (82) అనారోగ్యంతో కన్నుమూశారు.

By అంజి  Published on  10 Oct 2022 4:30 AM GMT
తుదిశ్వాస విడిచిన ములాయం సింగ్​ యాదవ్

యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయంసింగ్‌ యాదవ్‌ (82) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా ములాయం సింగ్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనను హర్యానాలోని వేదాంత ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ములాయంసింగ్‌ తుది శ్వాస విడిచారు. మూత్రనాళ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా ములాయం ఆగస్టు 22న ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న ఆయన.. ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్ల సోమవారం కన్నుమూశారు.

ఎటావా జిల్లాలోని సైఫాయి గ్రామంలో 1939 నవంబర్‌ 22న మూర్తిదేవి-సుఘర్‌సింగ్‌ యాదవ్‌ దంపతులకు ములాయం సింగ్‌ జన్మించారు. 1992లో ములాయం సమాజ్‌వాదీ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత యూపీలో సమాజ్‌వాదీ పార్టీని తిరుగులేని శక్తిగా మార్చారు. మూడుసార్లు ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రిగా, ఒకసారి రక్షణ మంత్రిగా పనిచేశారు. శాసనసభ్యడిగా 10 సార్లు, లోక్​సభ సభ్యుడిగా ఏడుసార్లు ఎన్నికయ్యారు. ములాయం హయాంలో ఉత్తర్​ప్రదేశ్‌ చాలా అభివృద్ధి చెందింది. యూపీలో అనేక సంస్కరణలను పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారు.

2003లో ఆయన మొదటి భార్య మాలతీ దేవి కన్నుమూశారు. ఆ తరువాత సాధన గుప్తాను వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది జులైలో ఆమె తుదిశ్వాస విడిచారు. ములాయం సింగ్‌ కుమారుడు అఖిలేష్ యాదవ్ పూర్తిస్థాయిలో క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత.. ఆయన రాజకీయాలకు దూరం అయ్యారు.


Next Story