కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. సామాన్యులు, సెలబ్రెటీలు అన్న తేడా లేకుండా అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు ఈ మహమ్మారి బారిన పడి మరణించగా.. తాజాగా ప్రముఖ కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మాజీ సీఎం జగన్నాథ్ పహాడియా కన్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. కరోనా బారినపడిన ఆయన చికిత్స పొందుతూ మరణించినట్లు హాస్పిటల్ వర్గాలు పేర్కొన్నాయి. పహాడియా 1980-81లో రాజస్థాన్ ముఖ్యమంత్రి పని చేశారు. ఆ తర్వాత బిహార్, హర్యానా గవర్నర్‌గానూ సేవలందించారు.
జగన్నాథ్ పహాడియా మృతిపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణంతో షాక్‌కు గురయ్యానన్నారు. ఆయనకు మొదటి నుంచీ నాపై చాలా అభిమానం ఉందని.. పహాడియా మరణం తనకు వ్యక్తిగతంగా నష్టమని ట్వీట్ చేశారు. పహాడియా మృతికి రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఒక రోజు సంతాప దినంగా ప్రకటించింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కేబినెట్ సమావేశమై సంతాపం తెలుపనుంది. అధికారిక లాంఛనాలతో నేడు పహాడియా అంత్యక్రియలు జరుగనున్నాయి.