జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాతో పాటు డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరి తృటిలో పెను ప్రమాదం నుండి తప్పించుకున్నారు. జమ్మూలోని గ్రేటర్ కైలాష్ పరిధిలో ఒక వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా, రాయల్ పార్క్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి వారిపై కాల్పులకు తెగబడ్డాడు. అయితే, భద్రతా సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించడంతో ఇద్దరు నేతలు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని భద్రతా వర్గాలు వెల్లడించాయి.
ఈ కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పురాణీ మండికి చెందిన 65 ఏళ్ల కమల్ సింగ్ జమ్వాల్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న పిస్టోల్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా, గత 20 ఏళ్లుగా ఫరూక్ అబ్దుల్లాను చంపాలనే కుట్రతో తాను ఉన్నట్లు నిందితుడు విస్తుపోయే విషయాలను వెల్లడించాడు. ఈ దారుణ ఘటనపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న అత్యున్నత స్థాయి నేత వద్దకు దుండగుడు అంత సులభంగా ఎలా చేరుకోగలిగాడంటూ భద్రతా లోపాలపై ఆయన అధికారులను నిలదీశారు. ప్రస్తుతం పోలీసులు ఈ దాడి వెనుక ఉన్న అసలు కారణాలపై సమగ్ర విచారణ జరుపుతున్నారు.