ఇటీవల పంజాబ్ సీఎంగా రాజీనామా చేసిన అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ పార్టీలో ఆయన చేరనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన నేడు ఢిల్లీలో పర్యటించనుండడం కలకలం రేపుతోంది. కేంద్ర మంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన భేటికానున్నారు. సమావేశం అనంతరం ఆయన బీజేపీలో చేరుతారని సమాచారం. ఒకవేళ ఆయన బీజేపీలో చేరితే పంజాబ్‌లో కాంగ్రెస్ గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లేనని రాజకీయ నిపుణులు అంటున్నారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఒకవేళ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరితే.. ఆయనకు భారీ ఆఫర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా కెప్టెన్ అమరీందర్‌కు అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆయన బీజేపీలో చేరకున్నా కూడా.. ఆయన చేత కొత్త పార్టీని ఏర్పాటు చేసి ఆతరువాత బీజేపీకి అనుబంధంగా ఆ పార్టీ పనిచేసేలా కసరత్తులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.