రాజకీయ సిత్రం.. బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరి.. కొన్ని గంటలకే తిరిగి సొంత గూటికి..
గుజరాత్‌లో ఏప్రిల్ 26న జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నెలకొన్న తీవ్ర రాజకీయ కార్యకలాపాల నడుమ సోమవారం భావ్‌నగర్‌లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది.
By - Medi Samrat |
గుజరాత్‌లో ఏప్రిల్ 26న జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నెలకొన్న తీవ్ర రాజకీయ కార్యకలాపాల నడుమ సోమవారం భావ్‌నగర్‌లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఒక మాజీ బీజేపీ కార్పొరేటర్ కాంగ్రెస్‌లో చేరి, కొన్ని గంటల తర్వాత తిరిగి కాషాయ గూటికి చేరారు.
కాంగ్రెస్‌లో చేరినప్పుడు.. మాజీ బీజేపీ కార్పొరేటర్ అయిన 30 ఏళ్ల సేజల్ గోహెల్.. తాను కార్పొరేటర్‌గా ఉన్నప్పటికీ బీజేపీలో సురక్షితంగా భావించడం లేదని ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ.. ఆమె నగరంలో కల్తీ మద్యం వ్యాపారుల బెడదను కూడా ప్రస్తావించారు. సేజల్ 2021 నుండి 2026 మధ్యకాలంలో భావ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని 3వ వార్డు నుండి బీజేపీ కార్పొరేటర్‌గా పనిచేశారు.
కొన్ని గంటల తర్వాత బీజేపీలోకి తిరిగి వచ్చిన సేజల్.. తనను కొంతమంది కాంగ్రెస్ నాయకులు మోసం చేశారని ఆరోపించగా.. ఆ పార్టీ ఈ ఆరోపణను ఖండించింది.
12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన సేజల్.. 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్'తో మాట్లాడుతూ, “నేను కొంతమంది కాంగ్రెస్ నాయకుల మాటలకు కొద్దిగా లోనై ఆ తప్పు చేశాను. వారి (కాంగ్రెస్ నాయకుల) ప్రభావంతోనే నేను అలా చేశాను. కానీ నా తప్పును గ్రహించాక, నేను పార్టీలోకి (బీజేపీలోకి) తిరిగి వచ్చాను” అని అన్నారు.
తనను మోసం చేశారని ఆరోపించబడిన కాంగ్రెస్ నాయకుల గురించి అడగ్గా, వారి పేర్లు తనకు తెలియవని సేజల్ పేర్కొన్నారు. సేజల్ ఆరోపణలను భావ్‌నగర్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మనోహర్‌సింగ్ గోహిల్ తోసిపుచ్చారు.
"ఆమె (సేజల్) స్వచ్ఛందంగా మా వద్దకు వచ్చింది. గత 3-4 నెలలుగా ఆమె మాతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది. మేము ఆమెను ఎప్పుడూ పిలవలేదు. నిన్న ఆమె మా ఇద్దరు వార్డు నాయకులతో కలిసి నా వద్దకు వచ్చింది. ఆమె కాంగ్రెస్‌లో చేరవచ్చని, కానీ మేము ఆమెకు ఎలాంటి హామీ ఇవ్వలేమని (పార్టీ టికెట్ ఇవ్వడంతో సహా) నేను చెప్పాను," అని మనోహర్‌సింగ్ గోహిల్ తెలిపారు.
"కాంగ్రెస్‌లో చేరడానికి కారణం తన భద్రతాపరమైన ఆందోళనలేనని ఆమె స్వయంగా అంగీకరించారు. మీడియాతో ఏమి మాట్లాడాలో మేమెప్పుడూ ఆమెకు చెప్పడానికి ప్రయత్నించలేదు. ఆ తర్వాత కూడా ఆమెకు ఫోన్ చేయడానికి ప్రయత్నించలేదు. ఆమె ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొని ఉన్నా, అది ఆమెకే తెలుసు," అని గోహిల్ అన్నారు.
గుజరాత్‌లోని 15 మున్సిపల్ కార్పొరేషన్లు, 84 మున్సిపాలిటీలు, 34 జిల్లా పంచాయతీలు, 260 తాలూకా పంచాయతీలలో ఎన్నికలు ఏప్రిల్ 26న జరగనున్నాయి.. ఫలితాలు ఏప్రిల్ 28న ప్రకటించబడతాయి.