వేసవి ముదరకముందే.. ఉత్తరాఖండ్‌లో అడవుల్లో కార్చిచ్చులు
Forest fires flare up in uttarakhand.ఉత్తరాఖండ్‌లోని ఘర్‌వాల్, కమావూన్ అటవీ ప్రాంతాల్లో శనివారం కార్చిచ్చు చెలరేగింది.
By తోట వంశీ కుమార్ Published on 6 April 2021 2:55 AM GMTఉత్తరాఖండ్‌లోని ఘర్‌వాల్, కమావూన్ ప్రాంతాల్లో శనివారం కార్చిచ్చు చెలరేగింది. దాదాపు 62హెక్టార్ల అటవీ ప్రాంతంలో సంభవించిన మంటల కారణంగా ఇప్పటి వరకు నలుగురు వ్యక్తులు మృతి చెందారు. నైనిటాల్, అల్మోరా జిల్లాలు కార్చిచ్చుతో ప్రభావితం అయ్యాయి. మంటలను అదుపు చేయడానికి కేంద్రం ఆదివారం రెండు హెలికాప్టర్లను రాష్ర్టానికి పంపించింది. మంటలను ఆర్పేందుకు 12వేల మంది సిబ్బంది శ్రమిస్తున్నారు.
ఈ అగ్నికీలల ధాటికి సుమారు రూ.37లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు తెలిపారు. మరోవైపు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఈ ప్రమాదంపై అధికారులతో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. కాగా, మంటల నివారణకు భారత వాయుసేన హెలికాప్టర్లు అందించాలని కోరుతూ కేంద్రానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం రెండు హెలికాప్టర్లు, ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బందిని ఉత్తరాఖండ్‌కు పంపింది.
ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తో పాటుగా పలువురు నేతలు స్పందించారు. ఉత్తరాఖండ్ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు గురించి సీఎం తీరథ్ సింగ్‌తో మాట్లాడి ప్రాణ నష్టం జరగకుండా మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇటు కార్బెట్ నేషనల్ పార్క్ లోని అడవిలో అగ్ని ప్రమాదం పెరిగింది. శనివారం రాత్రికి రామ్‌నగర్ ఫారెస్ట్ డివిజన్‌కు సమీపంలోని అడవిలో మంటలు చెలరేగాయి. ఇది టెరాయ్ వెస్ట్ ఫారెస్ట్ డివిజన్‌లోని సవాల్డే, హల్డువా, కాశిపూర్ శ్రేణుల అడవులను బుగ్గిచేయడానికి దారితీసింది.
రాష్ట్రంలోని 964 ప్రదేశాలలో మంటలు కొనసాగుతున్నాయని రాష్ట్ర మంత్రి హరక్ సింగ్ రావత్ చెప్పారు. వాతావరణం పరిస్థితిని మరింత ఇబ్బందికరంగా తయారు చేసింది.
మంటలనార్పే విధుల్లో 12,000 కన్నా ఎక్కువ అటవీ సిబ్బంది పాల్గొంటున్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ఉద్యోగులకు సెలవు ఇవ్వవద్దని అధికారులను ఆదేశించారు.