పండుగకు ఆహ్వానించేందుకు వెళ్తే.. బలవంతంగా పెళ్లి చేశారు
Forced marriage by taking a person hostage in Nalanda district
By తోట వంశీ కుమార్ Published on 21 Nov 2021 2:55 PM ISTఇంట్లో పండుగ ఉండడంతో బంధువులను ఆహ్వానించేందుకు పక్క గ్రామానికి వెళ్లాడు ఓ యువకుడు. బంధువులను ఆహ్వానించి తిరిగి తన సొంత గ్రామానికి వస్తున్నాడు. అయితే.. మార్గ మధ్యంలో కొందరు ఆ యువకుడిని బంధించి వారి గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ ఆ యువకుడికి పెళ్లి చేశారు. తాళి కట్టేందుకు అతడు నిరాకరించడంతో తలకు గన్ ను గురిపెట్టారు. చేసేది ఏమీ లేక ఆ యువకుడు ఓ యువతి మెడలో మూడు ముళ్లు వేశాడు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ బలవంతపు పెళ్లి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి.
వివరాల్లోకి వెళితే.. నలంద జిల్లాలోని ధనుకి గ్రామంలో నితీష్ కుమార్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. చథ్ పండుగకు రమ్మని ఆహ్వానించేందుకు నవంబర్ 11న పక్కనే ఉన్న వదిన ఇంటికి వెళ్లాడు. వదిన వాళ్లను పండుగకు ఆహ్వానించి తిరుగుప్రయాణం అయ్యాడు. సొంతూరికి వస్తుండగా.. మార్గ మధ్యంలో కొందరు అతడిని కిడ్నాప్ చేశారు. ఓ కళ్యాణ మండపానికి తీసుకెళ్లారు. పెళ్లి కొడుకుగా ముస్తాబు చేశారు. తనను వదిలిపెట్టాలని నితీష్ కోరగా.. అక్కడ ఉన్నవారు అందుకు నిరాకరించారు.
పారిపోయేందుకు నితీష్ యత్నించగా.. కొట్టారు. అనంతరం యువతి మెడలో తాళి కట్టాలని ఒత్తిడి చేశారు. తాను కట్టనని నితీష్ ఎదురుతిరగగా.. నితీష్ తలకు తుపాకీ గురిపెట్టి అతడితో బలవంతంగా యువతి మెడలో తాళి కట్టించారు. అనంతరం వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న నితీష్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.