కూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి.. ఒకరు మృతి, 20 మందికి తీవ్ర గాయాలు

Foot over bridge at Balharshah railway station in Maharashtra collapses, over 20 injured. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. చంద్రపూర్‌లోని బల్లార్షా రైల్వే స్టేషన్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలో కొంత

By అంజి  Published on  28 Nov 2022 8:11 AM IST
కూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి.. ఒకరు మృతి, 20 మందికి తీవ్ర గాయాలు

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. చంద్రపూర్‌లోని బల్లార్షా రైల్వే స్టేషన్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలో కొంత భాగం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో చాలా మంది ప్రయాణికులు వంతెనపై నుంచి దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి ట్రాక్‌పై పడిపోయారు. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో 48 ఏళ్ల మహిళ మృతి చెందింది. ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధిత ప్రయాణికులు ప్లాట్‌ఫారమ్ నంబర్ 1 నుండి ప్లాట్‌ఫారమ్ నంబర్ 4కి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

ఈ సంఘటన ఆదివారం సాయంత్రం 5 గంటలకు జరిగింది. సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మాట్లాడుతూ.. "రైల్వే ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ. 1 లక్ష, సాధారణ గాయాలు తగిలిన వారికి రూ. 50,000 ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వ్యక్తులను త్వరగా కోలుకోవడానికి ఇతర ఆసుపత్రులకు తరలించి ఉత్తమ వైద్యం అందిస్తున్నారు" అని తెలిపారు.

"పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు పూణేకు వెళ్లే రైలులో ఎక్కేందుకు ఎఫ్‌ఓబిని ఉపయోగించారు. దీంతో బ్రిడ్జిలో కొంత భాగం అకస్మాత్తుగా కూలింది. ఫలితంగా, కొంతమంది 20 అడుగుల ఎత్తు నుండి క్రింద ఉన్న రైల్వే ట్రాక్‌పై పడిపోయారు" అని అధికారి తెలిపారు. గుజరాత్‌లోని మచ్చు నదిపై మోర్బిలో 'వ్రేలాడే' సస్పెన్షన్ ఫుట్‌బ్రిడ్జ్ కూలిపోయి, 135 మంది మరణించారు. అనేకమంది గాయపడిన ఒక నెల తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనను 'పెద్ద విషాదం' అని సుప్రీంకోర్టు పేర్కొంది.

Next Story