దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇక అప్పుడే పుట్టిన చిన్నారులను సైతం ఈ మహమ్మారి వదలడం లేదు. పుట్టిన ఐదు రోజులకే ఓ చిన్నారికి కరోనా సోకింది. దీంతో ఆ చిన్నారికి కరోనా చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ చిన్నారికి 12 రోజులు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ లోని అమ్రెలి ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల ఓ మహిళ.. ఏప్రిల్ 1 తేదిన ప్రసవం కోసం డైమండ్ ఆస్పత్రిలో చేరింది.
అదే రోజు ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. ఆ పాప ఏప్రిల్ 6న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో డాక్టర్లు కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ అని వచ్చింది. దీంతో వెంటనే ఆ చిన్నారిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సనందిస్తున్నారు. కాగా.. దీనిపై డాక్టర్ అల్పేష్ సిఘ్వీ మాట్లాడుతూ.. శ్వాస తీసుకోవటంతో శిశువు ఇబ్బంది పడుతుండటంతో అనుమానం వచ్చి..ఎక్స్ రే తీయగా..ఏదో సమస్య ఉన్నదని గుర్తించి యాంటీజెన్ టెస్టు చేశామన్నారు. దీనిలో ఆ శిశువుకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ శిశువును వెంటిలేటర్‌పై ఉంచి, చికిత్స అందిస్తున్నామన్నారు. చిన్నారికి రెమిడెసివిర్ ఇంజిక్షన్ ఇచ్చామన్నారు. ఆ చిన్నారికి ప్లాజ్మా చికిత్స అందించనున్నామని..ప్రస్తుతం పాప పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.