Nagaland: తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన ఇద్దరు మహిళలు

మొట్టమొదటి సారిగా మహిళలు నాగాలాండ్‌ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.

By అంజి  Published on  2 March 2023 2:00 PM GMT
Nagaland, Assembly Elections, National news

తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికైన మహిళలు (హెకానీ జఖాలు, సల్హౌతునో క్రుసె)

ఈ ఏడాది నాగాలాండ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు చరిత్రలో సరికొత్త పేజీని లిఖించాయి. మొట్టమొదటి సారిగా మహిళలు నాగాలాండ్‌ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. అసెంబ్లీకి ఎన్నికైన తొలి మహిళగా హెకానీ జఖాలు గురువారం చరిత్ర సృష్టించారని అధికారులు తెలిపారు. అయితే ఆ కాసేపటికే సల్హౌతునో క్రుసె కూడా విజయం సాధించారు.

ఈ ఇద్దరు మహిళలు నేషనల్‌ డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ అభర్థులుగా బరిలో నిలిచి గెలిచారు. దిమాపూర్ - III స్థానానికి పోటీ చేసిన నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డీపీపీ) అభ్యర్థి జఖాలు.. తన సమీప ప్రత్యర్థి లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కి చెందిన అజెటో జిమోమిపై 1,536 ఓట్ల తేడాతో విజయం సాధించారని భారత ఎన్నికల సంఘం తెలిపింది. అలాగే పశ్చిమ అంగామీ నుంచి క్రుసె జయకేతనం ఎగురవేశారు. స్వతంత్ర అభ్యర్థి కెనీఝాఖో నఖ్రోపై ఆమె పోటీ చేశారు. ఆమెకు 7078 ఓట్లు రాగా, నఖ్రోకు 7071 మంది ఓటేశారు. దాంతో ఆమె ఏడు ఓట్ల తేడాతో విజయం సాధించినట్లయింది.

యూఎస్‌లోని శాన్‌ఫ్రాన్సిస్కో విశ్వవిద్యాలయం నుంచి హెకానీ జఖాలు.. లా విద్యనభ్యసించారు. కొంతకాలం అమెరికాలో పనిచేసి, ఆ తర్వాత ఢిల్లీకి వచ్చి, లాయర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడి నుంచి తన స్వరాష్ట్రం నాగాలలాండ్‌కు వెళ్లిన హెకానీ.. యూత్‌నెట్‌ అనే ఎన్‌జీవో సంస్థను స్థాపించారు. యువతకు మరిన్ని అవకాశాలు అందుబాటులో ఉంచాలన్నది దీని ప్రధాన లక్ష్యం. దీనిద్వారా ఇప్పటివరకు 23,500 మంది లబ్ధి పొందారు. 2018లో హెకానీకి నారీ శక్తి పుస్కారం దక్కింది. ఇదిలా ఉంటే.. మరో మహిళ ఎమ్మెల్యే సల్హౌతునొ క్రుసె ఒక హోటల్‌ యజమాని. ఈమెకు బీజేపీ అగ్రనేత హిమంత బిశ్వ శర్మ, నాగాలాండ్ సీఎం మద్ధతు ప్రచారం బాగా కలిసొచ్చింది.

1963లో నాగాలాండ్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా లభించింది. ఇప్పటి వరకు 13 సార్లు శాసనసభ ఎన్నికలు జరిగాయి. అయితే ఇప్పటివరకు ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. కానీ తాజాగా ఎన్నికలతో నాగాలాండ్‌ అసెంబ్లీలో మహిళలు తమ పాదం మోపబోతున్నారు. రాష్ట్రంలో మొత్తం 13.17లక్షల మంది ఓటర్లు. అందులో దాదాపు సగం 6.56 లక్షల మంది మహిళా ఓటర్లే.

Next Story