జూన్ 24 నుండి పార్లమెంట్‌ సమావేశాలు.. ఎప్పటి వరకు అంటే?

18వ లోక్‌సభ తొలి సెషన్‌ జూన్‌ 24న ప్రారంభమై జూలై 3న ముగుస్తుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు బుధవారం తెలిపారు.

By అంజి  Published on  12 Jun 2024 10:47 AM IST
18th Lok Sabha, Rajya Sabha, Kiren Rijiju, National news

జూన్ 24 నుండి పార్లమెంట్‌ సమావేశాలు.. ఎప్పటి వరకు అంటే?

18వ లోక్‌సభ తొలి సెషన్‌ జూన్‌ 24న ప్రారంభమై జూలై 3న ముగుస్తుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు బుధవారం తెలిపారు. 9 రోజుల ప్రత్యేక సెషన్‌లో.. లోక్‌సభ స్పీకర్‌ను ఎన్నుకుంటారు. కొత్త పార్లమెంటు సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. సెషన్‌లో మొదటి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన నాయకులు ప్రమాణ స్వీకారం చేయడం లేదా లోక్‌సభలో వారి సభ్యత్వాన్ని ధృవీకరించడం ఉంటుంది. జూలై 3న సెషన్‌ ముగుస్తుంది.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్‌సభ , రాజ్యసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాబోయే ఐదేళ్ల కోసం కొత్త ప్రభుత్వ రోడ్‌మ్యాప్‌ను వివరించే అవకాశం ఉంది. "18వ లోక్‌సభ మొదటి సెషన్‌ను 24/6/24 నుండి 3/7/24 వరకు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణం/ధృవీకరణ, స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది" అని రిజిజు ఎక్స్‌లో పోస్ట్‌లో తెలిపారు.

రాజ్యసభ 264వ సమావేశాలు కూడా జూన్ 27న ప్రారంభమై జూలై 3న ముగుస్తాయని, జూన్ 27న రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రధాని మోదీ తన మంత్రి మండలిని పార్లమెంటుకు పరిచయం చేస్తారని ఆయన అన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చలో వివిధ అంశాలపై ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు దూకుడుగా ఉన్న ప్రతిపక్షం ప్రయత్నిస్తుందని భావిస్తున్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని సమాధానం ఇస్తారు.

Next Story