నెల‌రోజుల కింద‌టే.. డెల్టా ప్లస్ వేరియంట్‌తో మ‌ర‌ణం.. ధ్రువీక‌రించిన అధికారులు

First Delta plus variant death case reported in Madhya Pradesh.దేశంలోనే మొట్ట‌మొద‌టిసారి డెల్టా ఫ్ల‌స్ వేరియంట్ తో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Jun 2021 12:03 PM IST
నెల‌రోజుల కింద‌టే.. డెల్టా ప్లస్ వేరియంట్‌తో మ‌ర‌ణం.. ధ్రువీక‌రించిన అధికారులు

దేశంలోనే మొట్ట‌మొద‌టిసారి డెల్టా ఫ్ల‌స్ వేరియంట్ తో క‌రోనా రోగి మృతిచెందిన ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఉజ్జ‌యిని న‌గ‌రంలో వెలుగుచూసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఐదుగురికి డెల్టాప్లస్ వైరస్ సోకింద‌ని ఉజ్జ‌యిని నోడ‌ల్ అధికారి తెలిపారు. అందులో ముగ్గురు భోపాల్‌కు చెందిన వారు కాగా, మరో ఇద్దరు ఉజ్జయినికి సంబంధించినవారని తెలిపారు. వారిలో నలుగురు కోలుకోగా.. ఓ మ‌హిళా రోగి మరణించారన్నారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జ‌యినీ ప్రాంతానికి చెందిన ఓ మ‌హిళ క‌రోనా సోకి మే 23న ప్రాణాలు కోల్పోయింది. ఆమె ర‌క్త‌న‌మూనాల‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయ‌గా.. ఆమెకు డెల్టా ఫ్ల‌స్ వేరియంట్ సోకిన‌ట్లు గుర్తించారు. డెల్టా ఫ్ల‌స్ వేరియంట్ నేప‌థ్యంలో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు.. ఈ ర‌కం సోకిన వారిని గుర్తించి కాంటాక్ట్ ట్రేసింగ్ మొద‌లు పెట్టారు.

కాగా.. సార్ట్ కొవిడ్-2 డెల్టా ప్లస్ వేరియంట్ ప్రబలిన నేపథ్యంలో రాష్ట్రంలో భారీగా పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి విశ్వస్ సారంగ్ చెప్పారు. డెల్టా ప్లస్ వేరియంట్ రోగుల కాంటాక్టు ట్రేసింగ్ జరుగుతుందన్నారు. ఈ వైరస్‌ సోకిన ఐదుగురిలో నలుగురు వ్యాక్సిన్ వేయించుకున్నారని, వారంతా కోలుకున్నారని, కానీ టీకా తీసుకోని రోగి మరణించారని వెల్లడించారు. అర్హులైనవారంతా టీకాలు వేయించుకోవాలని ఆయన కోరారు.

ఇదిలా ఉంటే.. దేశంలో 40కిపైగా డెల్టా ఫ్ల‌స్ వేరియంట్ కేసులు వెలుగు చూసిన‌ట్లు నిన్న కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పిన సంగ‌తి తెలిసిందే. మ‌హారాష్ట్ర‌లో అత్య‌ధికంగా 21 కేసులు న‌మోదు కాగా.. ఆ త‌రువాత మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఆరు, కేర‌ళ‌, త‌మిళ‌నాడుల్లో మూడు, క‌ర్ణాట‌క‌లో 2, పంజాబ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జ‌మ్ముక‌శ్మీర్‌ల‌లో ఒక్కొ కేసు న‌మోదు అయ్యాయి.

Next Story