నేటి నుండి అందుబాటులోకి '2డీజీ' డోసులు

DRDO's anti-COVID drug 2-DG to be released today. డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 ఔషధం 2-డియాక్సీ డి-గ్లూకోజ్‌(2డీజీ) నేటి నుండి అందుబాటులోకి రానుంది

By Medi Samrat  Published on  17 May 2021 4:40 AM GMT
DRDO’s anti-COVID drug

డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 ఔషధం 2-డియాక్సీ డి-గ్లూకోజ్‌(2డీజీ) నేటి నుండి అందుబాటులోకి రానుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేడు ఢిల్లీలోని పలు ఆసుపత్రుల్లో మొత్తం 10 వేల డోసులు పంపిణీ చేయనున్నారు. పొడి రూపంలో రానున్న ఈ ఔషధాన్ని నీటితో కలిపి తీసుకోవాలని ఇప్పటికే వైద్యులు తెలియజేశారు.

2-డీజీ ఔషధానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసింది. పౌడర్‌ రూపంలో ఉండే సాచెట్‌ నేడు అందుబాటులోకి రానుంది. 10వేల మోతాదుల మొదటి బ్యాచ్‌ను నేటి నుండి అందుబాటులోకి తీసుకురానున్నట్లు డీఆర్డీఓ అధికారులు సంయుక్తంగా వెల్లడించారు. వాటిని కరోనా బాధితులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. సాచెట్లలో పొడి రూపంలో దొరుకుతుంది. దీన్ని నీటిలో కరిగించి నోటి ద్వారా తీసుకోవాలి. ఇది వాడిన చాలా మందికి RT-PCR టెస్టుల్లో నెగెటివ్ వచ్చిందని డీఆర్‌డీవో ప్రతినిధులు వివరించారు. అందుకే దీనికి DCGI అనుమతి ఇచ్చింది. నేటి నుండి ఇది అందుబాటులోకి వస్తుండడంతో కరోనా మరణాలు తగ్గే అవకాశాలు ఉంటాయని అధికారులు భావిస్తూ ఉన్నారు. ఈ ఔషధాన్ని డీఆర్డీవోకు చెందిన ఓ ప్రయోగశాల, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ సైన్సెస్ (ఇన్మాస్), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ ఔషధాన్ని వాడిన కరోనా రోగులు వేగంగా కోలుకుంటున్నట్టు క్లినికల్ ట్రయల్స్ లో తెలిసొచ్చింది.

2-డీజీ ఔషధాన్ని తీసుకున్న రోగులకు ఆక్సిజన్ పై ఆధారపడాల్సిన అవసరం రాలేదని.. ఈ ఔషధంతో చికిత్స పొందిన కరోనా రోగుల్లో చాలామందికి స్వల్పకాలంలోనే ఆర్టీ-పీసీఆర్ టెస్టులో నెగెటివ్ వస్తోందని డీఆర్డీవో తెలిపింది. వైరస్ పెరుగుదలను ఇది కట్టడి చేస్తోందని తెలిపింది. ఔషధం తీసుకున్న తర్వాత కరోనా రోగులు త్వరగా కోలుకుంటున్నారని.. అంతేకాదు మెడికల్ ఆక్సిజన్‌పై ఆధారపడాల్సిన అవసరం లేకుండా చేస్తోందని డీఆర్డీవో వర్గాలు తెలిపాయి. ఓ మోస్తరు నుంచి తీవ్రమైన కొవిడ్‌ లక్షణాలున్న వారిలో ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు క్లినికల్‌ ట్రయల్స్‌లో వెల్లడైంది. కరోనా బాధితులు వేగంగా కోలుకోవడానికి ఇది సహకరిస్తుందని కృత్రిమ ఆక్సిజన్‌ అవసరాన్ని తగ్గిస్తోందని డీఆర్‌డీవో తెలిపింది.


Next Story
Share it