ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలోని కే-బ్లాక్‌లోని మురికివాడలో ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంలో 100కు పైగా గుడిసెలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు డజన్లకు పైగా ఫైరింజన్ వాహనాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. అగ్నిప్రమాదం అనంతరం ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. ప్రజలు కాలి బూడిదైన ఇళ్లలోంచి తమ వస్తువులను బయటకు తీయడంలో నిమగ్నమయ్యారు. సమాచారం ప్రకారం.. ప్రమాదంలో ఎవరూ గాయపడినట్లు నివేదించబడలేదు. అయితే.. కొంతమంది పిల్లల ఆచూకీ దొరకడం లేదని స్థానికులు అంటున్నారు.
మరోవైపు మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ హాస్టల్ గదిలో ఆదివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఢిల్లీ ఫైర్ సర్వీస్ (DFS) డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 6:09 గంటలకు మంటలు వ్యాపించాయని.. అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు.