చత్తీస్‌ఘడ్‌లో విషాదం చోటు చేసుకుంది. రాయపూర్ పచ్పెడీనాకా పరిధిలోని రాజధాని ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈప్రమాదంలో ఐదుగురు రోగులు సజీవ దహనం అయ్యారు. ఐసీయూలోని ఫ్యాన్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగిన కారణంగా చెలరేగిన మంటలు ఆస్పత్రిలోని కొవిడ్-19 పేషెంట్స్ వార్డుకి వ్యాపించాయి. దీంతో అక్కడ తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. రోగులు పరుగులు పెట్టారు. వెంటనే ఆస్పత్రి సిబ్బంది, స్థానికులు రోగులను బయటకు తరలించేందుక తీవ్రంగా శ్రమించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
మంటలు అదుపులోకి వచ్చిన అనంతరం పరిశీలించగా ఐదుగురు రోగులు మృత్యువాత పడ్డారని పోలీసులు, ఆస్పత్రి సిబ్బంది గుర్తించారు. ఈ ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నట్లు ఎస్పీ అజయ్ యాదవ్ తెలిపారు. ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి భూపేష్ భాగేల్.. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.