పెట్రోల్, గ్యాస్ ధరలు గత కొద్ది రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రజలను టెన్షన్ పెడుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే పెట్రో ధరలపై బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చమురుపై ఉన్న పన్నులు తగ్గించి సామాన్యులపై పడుతున్న భారాన్ని తప్పించాలని యోచిస్తోంది. ఈ మేరకు ఎక్సైజ్ డ్యూటీలను తగ్గించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తులు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వానికీ ఆదాయం లేకపోవడం, కరోనా ప్యాకేజీలకు భారీగా వెచ్చించడంతో ఖజానాకు చాలా నష్టం వచ్చింది, అందుకే గత్యంతరం లేని పరిస్థితుల్లో పన్నులు పెంచాల్సి వచ్చిందని అంటున్నారు.
ప్రస్తుతం చమురు రిటైల్ ధరలో పన్నుల వాటానే దాదాపు 60 శాతం దాకా ఉంది. ఈ నేపథ్యంలోనే చమురుపై ఉన్న పన్నులను తగ్గించేందుకు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, చమురు సంస్థలు, పెట్రోలియం శాఖతో ఆర్థిక శాఖ సంప్రదింపులు చేస్తోంది. వినియోగదారులపై భారాన్ని తగ్గించేందుకు ఏ రూపంలో పన్నుల్లో కోత విధించాలన్న దానిపై చర్చిస్తున్నారు. పన్నులను తగ్గించే ముందు ధరలను స్థిరీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.. ముడి చమురు ధరలు పెరిగినా.. రోజువారీగా ధరలను సమీక్షించే పద్ధతిని ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్టు కూడా తెలుస్తోంది.