కేంద్రం బడ్జెట్ 2021-22ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. దేశ చరిత్రలో తొలిసారిగా కాగిత రహిత బడ్జెట్ నేడు పార్లమెంట్ ముందుకు రానుంది. ట్యాబ్ లో తన బడ్జెట్ ప్రతిపాదనలను దాచుకున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఓ కాపీని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు అందించారు.
దాదాపు పావుగంట సేపు రాష్ట్రపతితో భేటీ అయి, బడ్జెట్ విశేషాలను పంచుకుని, అక్కడి నుంచి నేరుగా పార్లమెంట్ చేరుకున్నారు. అప్పటికే అక్కడికి మోడీ సహా, ఇతర క్యాబినెట్ మంత్రులు చేరుకోగా, బడ్జెట్ ను క్యాబినెట్ ముందుంచి, ఆమోదం తీసుకున్నారు.
మరోవైపు లోక్‌సభ సమావేశం ప్రారంభం కాగానే విపక్షాలు సభలో నిరసనకు దిగారు. స్పీకర్ ఓం బిర్లా వారిని వారించినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూనే ఉన్నారు. వారి నినాదాల నడుమే నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో ఆందోళన చేపట్టిన రైతన్నలకు మద్దతు తెలియజేస్తూ కాంగ్రెస్ ఎంపీలు జస్బీర్‌సింగ్ గిల్, గుర్జీత్‌సింగ్ ఔజ్లా లోక్‌సభకు నల్ల కోర్టులు ధరించి వచ్చారు.