భారతదేశంలో కరోనా మహమ్మారి విపరీతంగా ప్రబలడానికి ఎన్నికల ప్రచారమే అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పలు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాల సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపై తిరగడం.. సమావేశాలకు హాజరు అవ్వడం.. ఇలా చాలా వరకూ ఎన్నికల కారణంగా కరోనా వ్యాపించిందని అంటున్నారు. ఇక ఈరోజు పలు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు విడుదల అవుతూ ఉన్నాయి. ఇక విజయం సాధించిన నాయకుల అనుచరులు ఫుల్ హంగామా సృష్టించాలని అనుకుంటూ ఉన్నారు. అయితే వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

పలు ప్రాంతాల్లో పార్టీలు సంబరాలు చేసుకుంటూ ఉండగా కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీలు, బహిరంగ వేడుకలు జరపవద్దని తెలిపింది. తాము నిషేధాజ్ఞలు విధించినప్పటికీ కొన్నిచోట్ల అతిక్రమిస్తుండడం పట్ల ఈసీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఎవరైనా విజయోత్సవ ర్యాలీలు చేపడితే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఆ ప్రాంత ఎస్ఐని సస్పెండ్ చేయాలని అన్ని రాష్ట్రాల సీఎస్ లకు ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ లో చాలా చోట్ల విజయోత్సవాలు మొదలయ్యాయి.. ఇక తమిళనాడులో డీఎంకే విజయం సాధిస్తూ ఉండడంతో చాలా ప్రాంతాల్లో స్టాలిన్ అనుచరులు సందడి చేస్తూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాల వలన కరోనా మరింత ప్రబలే అవకాశం ఉందని నిపుణులు చెబుతూ ఉన్నారు.


సామ్రాట్

Next Story