కరోనా విలయం కారణంగా ఎన్నో ఘోరాలు మరెన్నో దారులు చూడాల్సి వస్తోంది. మనుషుల్లోనూ మానవత్వం మంటగలుపుతోంది. తాజాగా జరిగిన ఓ ఘటన అందరిని కన్నీరు పెట్టిస్తోంది. రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లా జల్వార్ గ్రామానికి చెందిన సీమ అనే యువతికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. దీంతో ఆమెను కోటాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. దాదాపు నెలరోజుల పాటు ఆ యువతి కరోనాతో పోరాడింది. అయితే.. చివరికి ఓడి మరణించింది. కుమారై మృతదేహాన్ని 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటికి తీసుకెళ్లేందుకు ఆ యువతి తండ్రి అంబులెన్స్ డ్రైవర్‌ను అడుడగా.. రూ.35వేలు డిమాండ్ చేశాడు.
పైసా కూడా తగ్గేది లేదని తెగేసి చెప్పాడు.అంత ఇవ్వలేనని ఆ తండ్రి.. అంబులెన్స్ డ్రైవర్‌ను ఎంతో బ్రతిమిలాడాడు. అయినప్పటికి ఫలితం లేకుండా పోయింది. దీంతో చేసేది ఏమీ లేక.. కుమారై మృతదేహాన్ని కారులో తీసుకెళ్లాడు. మృతదేహాన్ని ప్యాక్ చేసి ముందు సీటునే పాడెలా మార్చాడు. సీటును కాస్త కిందకు వంచి సీటు బెల్టుతో మృతదేహాన్ని కదలకుండా కట్టి.. కన్నీళ్లను ఆపుకుంటూ స్వగ్రామానికి చేరుకున్నాడు. మార్గమధ్యంలో కొందరు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో జిల్లా కలెక్టర్ వెంటనే విచారణకు ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన రేటు కంటే ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.