రేపటి నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి.. లేదంటే వడ్డనే.!
Fastag Compulsory From Tomorrow. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు అధిక సమయం వేచి చూసే అవసరం లేకుండా ఉండేందుకు రేపటి నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి..
By Medi Samrat Published on 14 Feb 2021 6:55 PM IST
టోల్ ప్లాజాల వద్ద వాహనాలు అధిక సమయం వేచి చూసే అవసరం లేకుండా ఉండేందుకు తీసుకువచ్చినదే ఫాస్టాగ్. బార్ కోడ్ తరహాలోని ఓ ఎలక్ట్రానిక్ స్టిక్కర్ నే ఫాస్టాగ్ అంటారు. తాజాగా ఫాస్టాగ్ వినియోగాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. ఇప్పటికే పలుమార్లు గడువు పెంచుతూ వచ్చిన కేంద్రం ఇకపై ఫాస్టాగ్ లేకపోతే జరిమానా వడ్డనకు సిద్ధమైంది. వాహనాలకు ఫాస్టాగ్ ఉంటేనే హైవేలపైకి ఎక్కాలి, లేదంటే రెట్టింపు టోల్ బాదుడు భరించాల్సివుంటుంది. ఫాస్టాగ్ వినియోగంతో హైవేలపై టోల్ ప్లాజాల దగ్గర సమయం వృథా అయ్యే అవకాశం ఉండదు. వాహనాలకు ఫాస్టాగ్‌ను టోల్ ప్లాజాల వద్ద లేదా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.
దీనికోసం వాహన రిజిస్ట్రేషన్ పత్రాలను అందుబాటులో ఉంచుకోవల్సి ఉంటుంది. ఫాస్టాగ్ ఖరీదు వాహనంపై ఆధారపడి ఉంటుంది. మీ కారు కోసం ఫాస్టాగ్ కొనాలంటే నేరుగా టోల్ ప్లాజాల దగ్గరే వెళ్లవచ్చు. దీనికోసం మీ ఐడీ, వెహికిల్ రిజిస్ట్రేషన్ పత్రాలను కచ్చితంగా తీసుకు వెళ్లాల్సి ఉంటుంది. కేవైసీ ప్రక్రియ కోసం ఇవి తప్పనిసరి. ఇంకా సులువుగా కొనాలనుకుంటే.. అమెజాన్ వెబ్‌సైట్‌కు లేదా ఈ ఫాస్టాగ్ అందించే బ్యాంక్ వెబ్‌సైట్లకు వెళ్లవచ్చు.
ప్రస్తుతానికి ఫాస్టాగ్‌ను హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, కోటక్, యాక్సిస్ బ్యాంకులు అందిస్తున్నాయి. అంతే కాదు మీ ఫోన్‌లోని పేటీఎం, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ యాప్స్ ద్వారా కూడా వీటిని కొనుగోలు చేయవచ్చు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్ ప్లాజాల్లో మొత్తం ఫాస్టాగ్ లేన్లు మాత్రమే ఉంటాయని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఫాస్టాగ్‌కు ఎంత ఖర్చువుతుంది?
ఇది రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి మీరు ఏ వాహనం కోసం తీసుకుంటున్నారు అంటే కార్, జీప్, వ్యాన్, బస్, ట్రక్, వాణిజ్య వాహనాలు వంటివి. రెండోది.. ఏ బ్యాంక్ నుంచి ఈ ఫాస్టాగ్‌ను తీసుకుంటారన్నదానిపై కూడా ధర ఆధారపడి ఉంటుంది. రూ.500 నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇందులోనే రీఫండబుల్ సెక్యూరిటీ అమౌంట్ రూ.250, కనీస బ్యాలెన్స్ రూ.150 కూడా ఉంటుంది. ఇక ఇదే ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి అయితే.. ట్యాగ్ జారీ చేయడానికి రూ.99.12, రూ.200 సెక్యూరిటీ డిపాజిట్, రూ.200 కనీస బ్యాలెన్స్ అవసరమవుతుంది.