ఢిల్లీ సరిహద్దుల్లో ఆగని ఉద్రిక్తత

Farmers Protest continue in Delhi Borders.కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని ఢిల్లీ సరిహద్దుల్లో ఆగని ఉద్రిక్తత.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Feb 2021 5:02 AM GMT
Farmers Protest continue in Delhi Borders

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహ‌ద్దుల్లో అన్న‌దాత‌లు చేస్తున్న ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. నేటితో ఈ ఆందోళ‌న‌లు 71వ రోజుకు చేరుకున్నాయి. సాగు చట్టాలను వెనక్కి తీసుకునే వరకు వెనక్కి తగ్గేది లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. సింఘ‌, టిక్రి, గాజీపూర్ స‌రిహ‌ద్దుల్లో ఆందోళ‌నల్లో పాల్గొంటున్న రైతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. జనవరి 26 ఘటన తరువాత రైతులు వెనక్కి తగ్గుతారని అంతా అనుకున్నా, రైతులు మాత్రం వెనక్కి అడుగు వేయడం లేదు. పైగా ఆందోళనలు మరింత ఉదృతం చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

కేంద్ర ప్ర‌భుత్వం ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో ఇంట‌ర్‌నెట్ సేవ‌లు నిలిపివేసింది. దీంతో ఇందుకు నిర‌స‌న‌గా.. ఫిబ్రవరి 6 వ తేదీన రాష్ట్ర, జాతీయ రహదారులను దిగ్బంధం చేసేందుకు రైతులు నడుం బిగించారు. 'చుక్కా జామ్' పేరుతో మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి 3 గంట‌ల వ‌ర‌కు ర‌హ‌దారులు దిగ్భందించాల‌ని రైతులు నిర్ణ‌యించారు. పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీ వస్తుండటంతో.. ఢిల్లీ పోలీసులు సరిహద్దుల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. బారీకేడ్లు, సిమెంట్ దిమ్మెలతో సరిహద్దులను మూసేశారు. అంతేకాదు, ఢిల్లీ సరిహద్దుల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి.

అంత‌ర్జాతీయంగా రైతుల‌కు కొంద‌రు ప్ర‌ముఖులు మ‌ద్దుతును తెల‌ప‌డాన్ని రైతు సంఘాలు స్వాగ‌తించాయి. ఇప్ప‌టికైనా త‌మ స‌మ‌స్య‌ను ప‌రిష్కరించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. పార్ల‌మెంట్ స‌మావేశాలు జ‌రుగుతున్న దృష్ట్యా స‌రిహ‌ద్దుల్లో భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు.


Next Story