పంటలను తగులబెడుతున్న రైతన్నలు.. ప్రభుత్వం ఆలకించేనా..!
farmers destroy crops to support BKU leader Rakesh Tikait's call. చాలా ప్రాంతాల్లో రైతులు పంటలను తగులబెట్టడం.. ట్రాక్టర్లలో తొక్కించడం చేస్తూ ఉన్నారు.
By Medi Samrat Published on 22 Feb 2021 4:51 PM ISTతమ ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం అణచివేయాలని చూస్తే పంటలను తగులబెడతామని రైతు నాయకుడు రాకేశ్ తికాయత్ చేసిన హెచ్చరికను రైతులు పాటించారు. హరియాణాలోని కొన్ని గ్రామాల్లో అన్నదాతలు తమ పంటలను తగులబెట్టారు. మరి కొంతమంది తమ పంటలను ట్రాక్టర్లతో తొక్కేశారు. నూతన సాగు చట్టాలను ఉపసంహరించడాన్ని గొప్పగా భావించవద్దని కేంద్ర ప్రభుత్వానికి పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ విజ్ఞప్తి చేశారు. దయచేసి పంటలను తగులబెట్టవద్దని రైతులకు ఆయన విజ్ఞప్తి చేశారు. పలువురు రాజకీయ నాయకులు, రైతు సంఘాల నేతలు కూడా పంటలను తగులబెట్టకండి అని రైతులను కోరుతూ ఉన్నారు.
నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఈనెల 23 నుంచి 27 వరుస కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 23న పగడీ సంభాల్ దివస్ (తలపాగాను కాపాడుకునే రోజు), 24న దమన్ విరోధీ దివస్ (అణచివేత నిరోధక దినం), 26న యువకిసాన్ దివస్(యువ రైతుల దినోత్సవం), 27న మజ్దూర్ కిసాన్ ఏక్తా దినం(రైతులు, కార్మికుల ఐక్యతా రోజు) నిర్వహిస్తామని సంయుక్త్ కిసాన్ మోర్చా(ఎస్కేఎం) తెలిపింది. తమ ఉద్యమాన్ని అణచివేసే చర్యలను కేంద్రం మానుకోవాలని ఎస్కేఎం నేతలు కోరారు. మరోవైపు రైతుల ఉద్యమానికి అమెరికాకు చెందిన 87 రైతు సంఘాలు మద్దతు పలికాయి.