వెనక్కు తగ్గని రైతులు.. ఫిబ్రవరి 6న రాస్తారోకో
farmers announce nationwide 'chakka jam' on February 6. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు ఆందోళలను చేస్తూ ఉన్నారు.
By Medi Samrat Published on 2 Feb 2021 3:38 PM ISTవ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు ఆందోళలను చేస్తూ ఉన్నారు. ప్రభుత్వంతో ఎన్ని సార్లు చర్చలు జరిపినా కూడా రైతుల డిమాండ్లను ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. దీంతో ఆందోళనను మరింత ఉధృతం చేయాలని భావిస్తూ ఉన్నారు. దీంతో రైతులు ఫిబ్రవరి 6న దేశవ్యాప్తంగా రాస్తా రోకో (చక్కా జామ్) నిర్వహించాలని నిర్ణయించారు. ఆ రోజున జాతీయ, రాష్ట్ర రహదారులను మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటలపాటు దిగ్బంధించనున్నట్టు రైతుల సంఘాలు ప్రకటించాయి.
పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి జరిగిన కేటాయింపులతో తమకు సంబంధం లేదని, తాము కోరుకుంటున్నది సాగు చట్టాల రద్దేనని రైతు నేత రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో బడ్జెట్ విషయాల గురించి తమకు ఎటువంటి సమాచారం లేదని కూడా చెప్పుకొచ్చారు రైతు సంఘాల నేతలు. పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర గురించి ప్రభుత్వం మాట్లాడడం లేదని, తాము ప్రధానితో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నామని అన్నారు. వ్యవసాయ రుణ లక్ష్యాన్ని పెంచినంత మాత్రాన ప్రయోజనం లేదని, రైతుల ఆదాయాన్ని పెంచే చర్యలు చేపట్టాలని రైతు సంఘాల నేతలు చెప్పుకొచ్చారు.
శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు దేశవ్యాప్తంగా రోడ్లన్నీ దిగ్బంధించి నల్ల చట్టాలపై నిరసన తెలపాలని మంగళవారం రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త్ కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. సోమవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్‌లో మమ్మల్ని విస్మరించారు అంటూ రైతులు తమ అసంతృప్తిని వెల్లడించారు.
జనవరి 26న జరిగిన విధ్వంసం అనంతరం ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడాన్ని రైతులు తప్పు పడుతున్నారు. ప్రభుత్వం కావాలనే తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని వారు విమర్శిస్తున్నారు. దేశ రాజధాని సరిహద్దుల్లో నిరసన జరుగుతున్న ప్రదేశాల్లో పెద్ద ఎత్తున భారీకేడ్లు ఏర్పాటు చేయడాన్ని, వేల సంఖ్యలో పోలీసు బలగాల్ని మోహరించడాన్ని ఖండిస్తున్నారు రైతులు.