కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే..! కేంద్ర ప్రభుత్వం తమ నిరసనలను పట్టించుకోవడం లేదని.. నిరసనలను మరింత ఉధృతం చేస్తామని రైతు సంఘాల నాయకులు చెబుతూ ఉన్నారు. ఏ క్షణంలోనైనా ఢిల్లీకి రావడానికి సిద్ధంగా ఉండాల్సిందిగా భారతీయ కిసాన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాకేశ్ తికాయత్ రైతులకు పిలుపునిచ్చారు.
ఏ సమయంలోనైనా ఢిల్లీ వచ్చేందుకు వీలుగా ట్రాక్టర్ల ట్యాంకులను ఫుల్ చేయించుకోండి. మనతో చర్చించకుండా కేంద్రం చట్టాలు చేసింది. ఆ చట్టాల ఉపసంహరణ మన లక్ష్యమని తాజాగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికల సమయంలోనే మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని.. రైతు సంఘాలు ఈ దిశగా కార్యాచరణకు కూడా సమాయత్తమయ్యారు. రైతుల మద్దతు కూడగట్టేందుకుగాను తికాయత్ ఈ నెలలో మొత్తం ఐదు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లతో పాటు తొలిసారిగా దక్షిణాది రాష్ట్రాలు- కర్ణాటక, తెలంగాణల్లో ఆయన బహిరంగసభలు నిర్వహించనున్నారు.
గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట వద్ద జరిగిన హింసా విధ్వంసాలు బీజేపీ పనేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ట్రాక్టర్ ర్యాలీ సమయంలో హింసకు కుట్ర పన్నింది, కోటలోకి చొరబడింది బీజేపీ శ్రేణులేనని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. రైతులను ఉద్దేశపూర్వకంగా దారి మళ్లించింది బీజేపీ శ్రేణులేనని కేజ్రీవాల్ ఆరోపణలు గుప్పించారు. గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట వద్ద ఊహించని విధంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే..! ఈ హింసాత్మక ఘటనల వెనుక కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.