రాజస్థాన్ రాష్ట్రంలో ఓ భర్త తన భార్య అంగీకారంతో లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఆ వ్యక్తి భార్యకు జైపూర్‌లోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. జోధ్‌పూర్‌కు చెందిన 45 ఏళ్ల భర్త, జైపూర్‌కు చెందిన అతని భార్య మధ్య పరస్పర అంగీకారం ఆధారంగా కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. దాదాపు 16 ఏళ్ల పాటు కలిసి ఉన్న ఈ జంట పరస్పర అంగీకారంతో గతేడాది మేలో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
విడాకుల సెటిల్మెంట్ డీడ్ ప్రకారం, ఆస్తి, భరణం, వరకట్నానికి సంబంధించి వారి మధ్య ఎటువంటి వివాదం లేదు. భర్తకు లింగమార్పిడి శస్త్ర చికిత్స చేయడంతో తమ మధ్య వైవాహిక బంధం తెగిపోవడంతో 2017 మార్చి నుంచి వేర్వేరుగా జీవిస్తున్నట్లు దరఖాస్తులో పేర్కొన్నారు. భార్యాభర్తల విడాకుల దరఖాస్తును ఆమోదించిన కోర్టు విడాకుల డిక్రీని జారీ చేసింది.